Site icon NTV Telugu

Honour Killing: టిక్‌టాక్ చేస్తుందని 17 ఏళ్ల పాక్ యువతి పరువు హత్య..

Sana Yusuf

Sana Yusuf

Honour Killing: పరువు హత్యలకు కేరాఫ్‌గా ఉన్న పాకిస్తాన్‌లో మరో హత్య జరిగింది. 17 ఏళ్ల యువతిని సొంత బంధువుల్లో ఒకరు కాల్చి చంపారు. టిక్ టాక్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న సనా యూసఫ్‌ని ఇస్లామాబాద్‌లో తన ఇంట్లోనే చంపారు. ఇది పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా ఆమెకు 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సనా యూసుఫ్‌ని బంధువు అతి దగ్గర నుంచి చంపినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.

Read Also: Colorado Attack: యూదు వ్యతిరేకుల వీసాలను రద్దు చేస్తాం.. అమెరికా హెచ్చరిక

సెక్టార్ G-13లోని ఆమె ఇంట్లో ఈ సంఘటన జరిగింది. నిందితుడు సనాని చంపేటప్పుడు ఆమె ఇంటి బయట కొంత సమయం మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి, అనేక సార్లు కాల్పులు జరిపి తప్పించుకున్నాడని చెప్పారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయనప్పటికీ, పరువు హత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సనా యూసఫ్ వల్ల కుటుంబానికి అవమానం, అగౌరవం కలుగుతుందనే కుటుంబీకులు హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సనా యూసఫ్ తన టిక్‌టాక్ వీడియోలతో పాకిస్తాన్‌లో చాలా ఫేమస్. ఆమె తన వీడియోల ద్వారా మహిళ హక్కులు, సంస్కృతి, విద్యపై అవగాహన ప్రోత్సహించడం వంటివి చెబుతుంది. పాకిస్తాన్‌లో సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన చాలా మంది ఇటీవల కాలంలో హత్యలకు గురయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసినందుకు క్వెట్టాలో హీరా అనే 15 ఏళ్ల బాలికను సొంత తండ్రి, మామ కలిసి చంపారు. టిక్ టాక్ వాడటం మానేయాలని నిరాకరించినందుకు ఆమె తండ్రి అన్వరుల్ హక్ కోసంతో ఈ చర్యకు పాల్పడ్డాడు.

Exit mobile version