Site icon NTV Telugu

Simla Agreement: ‘‘సిమ్లా ఒప్పందం’’ నిలిపేస్తున్నట్లు ప్రకటించిన పాకిస్తాన్.. ఏంటీ ఒప్పందం..?

Pakistan Suspends Simla Agreement

Pakistan Suspends Simla Agreement

Simla Agreement: భారత్‌పై పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. పహల్గామ్ దాడి కూడా ఈ కోవకు చెందిందే. లష్కరే తోయిబా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలు తీసుకున్నారు. దీంతో, భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే, ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ రద్దు చేసుకుంది. అట్టారీ బోర్డర్‌ని మూసేసింది.పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ కూడా భారత్‌పై ప్రతీకార చర్యలు దిగుతోంది. భారత్‌తో వాణిజ్యాన్ని రద్దు చేసుకుంది. అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ‘‘సిమ్లా ఒప్పందం’’ కూడా ఉంది. పాక్ తన గగనతలాన్ని భారత విమానాలకు నిరాకరించింది. వాఘా సరిహద్దును మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ(ఎన్ఎస్‌సీ) సమావేశం తర్వాత ఈ ప్రతిస్పందన వచ్చింది.

Read Also: Spy Satellite: Spy Satellite: పాకిస్తాన్‌పై నిఘా.. ‘‘స్పై శాటిలైట్’’ ప్రయోగాన్ని వేగవంతం చేసిన భారత్.

సిమ్లా ఒప్పందం రద్దు.. ఏమిటీ ఒప్పందం:

1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య 1972లో ‘సిమ్లా ఒప్పందం’’ కుదిరింది. ఇది రెండు దేశాల మధ్య శాంతి ఇప్పందం. ఈ ఒప్పందంపై భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోలు సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా కాశ్మీర్‌లో యంత్రణ రేఖ (LOC) ఏర్పాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 1971 డిసెంబర్ 17 నాటి కాల్పుల విరమణ రేఖను భారతదేశం- పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖ (LOC)గా మార్చారు.

భారత్, పాక్ మధ్య యుద్ధ ఖైదీలు తిరిగి రావడం, సరిహద్దుల్లో దళాలను ఉపసంహరించుకోవడం, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా భవిష్యత్ వివాదాలను పరిష్కరించుకుంటామని ఒప్పందంలో పొందు పరిచారు. అంటే, కాశ్మీర్ సహా అనేక విషయాలను ఇరు దేశాలు మూడో దేశం జోక్యం లేకుండా పరిష్కరించుకోవాలన్నదే ఉద్దేశం. ప్రస్తుతం, ఈ ఒప్పందాన్ని నిలిపేస్తే, మూడో దేశం జోక్యం చేసుకునే అవకాశం కలుగుతుంది. గతంలో పలు సందర్భాల్లో కాశ్మీర్ ఇష్యూలో కలగజేసుకునేందుకు ఐక్యరాజ్యసమితి కూడా నిరాకరించింది.

అయితే, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ‘‘సిమ్లా ఒప్పందాన్ని’’ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. సింధు, దాని ఉపనదులు నీటిని మళ్లించడాన్ని, అడ్డుకోవడాన్ని తీవ్రంగా తిరస్కరిస్తామని పాక్ ప్రకటించింది. ఇది ‘‘జలయుద్ధంగా’’ అభివర్ణించింది. దీనిని యుద్ధ చర్యగా భావిస్తామని చెప్పింది.

Exit mobile version