Pakistan: పాకిస్తాన్ సైన్యానికి చీఫ్‌గా మారిన తర్వాత అసిమ్ మునీర్ ప్రవేశపెట్టిన ‘‘డిఫెన్స్ డాక్ట్రిన్’’(రక్షణ సిద్ధాంతం) కీలక లక్ష్యాలను వెల్లడిస్తోంది. ముస్లిం దేశాలకు ‘‘పెద్దన్న’’గా వ్యవహరించాలని పాక్ తహతహలాడుతోంది. ఆయుధాల ఎగుమతి, వ్యూహాత్మక సంబంధాలు, ఒప్పందాలు, సైనిక శిక్షణా కార్యక్రమాల ద్వారా ముస్లిం దేశాలకు తానే సంరక్షకుడిని అనే భావన కలిగించాలని పాక్ ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ప్రాంతీయ బెదిరింపులు, అస్థిరత ఎదుర్కొంటున్న ముస్లిం దేశాలకు అణ్వాయుధ రక్షణను అందించాలని పాకిస్తాన్ భావిస్తోంది. ముస్లిం ప్రపంచంలో పాకిస్తాన్ వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. ఇజ్రాయిల్, ఇతర దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మిత్రదేశాలకు వ్యూహాత్మక హామీలను అందించాలని పాక్ భావిస్తోంది. తద్వారా ఆయా దేశాల్లో తన పరపతి పెంచుకోవాలని చూస్తోంది.
ఇప్పటికే సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య వ్యూహాత్మక సైనిక ఒప్పందం జరిగింది. ఇందులో పాక్-చైనాలు సంయుక్తంగా తయారు చేస్తున్న JF-17 థండర్ యుద్ధ విమానాల ఒప్పందం ఒక్కటే సుమారు 3.7 బిలియన్ డాలర్ల విలువ ఉండొచ్చని అంచనా. ఇటీవల, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. దాదాపు 8 ముస్లిం దేశాలు పాకిస్తాన్‌తో రక్షణ భాగస్వామ్యాలపై ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. పాక్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఎగుమతుల ఆర్డర్లను పొందింది. రాబోయే మూడు నుంచి 5 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల ఆయుధ అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది.
అజర్‌బైజాన్‌కు 40 JF-17 ఫైటర్ జెట్‌ల కోసం $4.6 బిలియన్ల ఒప్పందం కుదుర్చుకుంది. లిబియా, సూడాన్, బంగ్లాదేశ్‌లకు పెద్ద ఎత్తున ఆయుధాలను అమ్మే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జోర్డాన్, ఈజిప్టులు కూడా పాకిస్తాన్ రక్షణ పరికరాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ఒప్పందాల తర్వాత పాకిస్తాన్ ముస్లిం దేశాలలో నాటో లాంటి సైనిక కూటమిని నిర్మించడానికి ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి.
