Site icon NTV Telugu

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం.. ఇవాళే ఓటింగ్..

Imran Khan

పాకిస్థాన్‌లోని ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో కీలక మలుపు చోటు చేసుకుంది.. నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది పాక్‌ సుప్రీంకోర్టు… వెంటనే నేషనల్ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది… ఇక, నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అధ్యక్షుడిని కోరలేరని పేర్కొంది.. ఇవాళ అసెంబ్లీని సమావేశ పర్చాలని, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో.. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరగబోతోంది. మరోవైపు.. జాతినుద్దేశించి ప్రసగించిన ఇమ్రాన్‌ ఖాన్‌.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. దేశవ్యాప్తంగా ఆదివారం భారీ నిరసనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.

Read Also: YS Jagan: దూకుడు పెంచిన ఏపీ సీఎం.. వ్యూహం మారిందా..?

ఇక, మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. హిందుస్థాన్‌ పేరును ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనైన ఆయన.. భారత్‌లో తనకు ఎంతో గౌరవం వచ్చిందని అన్నారు. భారత్‌ను నిస్వార్థ దేశంగా అభివర్ణించిన ఆయన.. భారత స్వతంత్ర విదేశాంగ విధానం ఎంతో గొప్పదని.. భారత్‌పై కుట్ర చేయడానికి ఎవరూ సాహసించరని పేర్కొన్నారు.. భారతదేశానికి ప్రపంచంలో ఎంతో గౌరవం ఉందని కొనియాడిన పాక్ ప్రధాని.. కానీ, పాకిస్థాన్ ఒక బానిస దేశమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి తాను ఇచ్చిన సలహా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విపక్షాల నేతలు అమ్ముడుపోయారని ఆరోపించిన ఆయన.. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా కుట్ర పన్నిందని మండిపడ్డారు.. 4 నెలల క్రితమే అమెరికా కుట్రలు ప్రారంభించిందని… అమెరికా.. పాకిస్థాన్ రాయబారిని బెదిరించిందన్న ఇమ్రాన్.. తనను తొలగించాలని అమెరికా కోరిందని.. తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి మొత్తం ప్లాన్ జరిగిందన్నారు.. కానీ, తాను ఎవరికీ కీలుబొమ్మను కాలేనని.. తనకు విదేశీ బ్యాంకుల్లో దోచుకున్న డబ్బు లేదని అన్నారు. ప్రతిపక్షం డబ్బు కోసం దేశాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు ఇమ్రాన్‌ ఖాన్.. అయితే, 342 మంది సభ్యులున్న పాక్‌ నేషనల్‌ అసెంబ్లీలో 172 మంది సభ్యుల మద్దతు ఉంటే ఇమ్రాన్‌ను ఓడించవచ్చు.. ఇప్పటికే అవసరమైన దానికంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతును చూపించారు. దీంతో.. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం అవిశ్వాసంలో గెలిచే పరిస్థితి కనిపించడంలేదు.. అదే జరిగితే.. పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి తొలగించబడిన తొలి ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్ నిలిచే అవకాశం ఉందంటున్నారు.

Exit mobile version