Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..

  • ప్రధాని షెహ్‌బాజ్ సమక్షంలో మొహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు
  • ‘‘నెల రోజులుగా ఆఫీసుకు రాని ఎన్నికైన ప్రతినిధి’’ అంటూ పరోక్ష విమర్శ
  • అసిమ్ మునీర్‌కు అత్యంత సన్నిహితుడిగా నఖ్వీ
Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సీన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్న సమావేశలో ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా కార్యాలయానికి రాని ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధిని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చీనయాంశంగా మారాయి. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన కాశ్మీర్ చౌక్ అండర్‌పాస్ శంకుస్థాపన కార్యక్రమంలో నఖ్వీ మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నికైన ప్రజాప్రతినిధి తమ సమయాన్ని ప్రజలకు ఎలా కేటాయిస్తున్నారో గమనించాలని అన్నారు. ‘‘మనమంతా ప్రజలకు జవాబుదారీ. ఎన్నికైన ప్రజాప్రతినిధి ప్రతీ నిమిషం ప్రజల కోసం కేటాయిస్తున్నారా? లేక ప్రతికూల రాజకీయాల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారా?. అనే విషయాన్ని ప్రజలు చూడాలి’’ అని అన్నారు.

ఇదే కాకుండా.. ‘‘ఒక వైపు నెల రోజులుగా ఆఫీసుకు రాని, ఒక్క సమావేశానికి హాజరుకానీ ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉన్నారు. మరోవైపు ఒక్క గంట కూడా విరామం తీసుకోకుండా మీ కోసం పనిచేస్తున్న వ్యక్తి ఉన్నారు’’ అని అన్నారు. అయితే నఖ్వీ నేరుగా ఏ నాయకుడి పేరు వెళ్లడించకున్నా, ప్రధాని ముందు ఈ వ్యాఖ్యలు చేయడంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

ఇటీవల, పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ అమెరికా, బ్రిటన్ పర్యటనలు ముగించుకుని ఇటీవలే పాకిస్తాన్ తిరిగి వచ్చారు. దీంతో నఖ్వీ షెహజాబ్ షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్లు చాలా మంది భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, సైన్యాధిపతి అయిన ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు నఖ్వీ చాలా ముఖ్య సన్నిహితుడు. నఖ్వీ ప్రస్తుతం పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రితో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) చైర్మన్‌గా కూడా ఉన్నారు.

ఇటీవల కాలంలో మొహ్సీన్ నఖ్వీ పాకిస్తాన్ రాజకీయాల్లో శక్తివంతంగా మారారు. పాక్ ప్రధాని కన్నా నఖ్వీకే అసిమ్ మునీర్ వద్ద పరపతి ఉన్నట్లుగా పాక్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. తాజాగా నఖ్వీ చేసిన వ్యాఖ్యల్లో ఆఫీసుకు రాని వ్యక్తి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అని, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి అసిమ్ మునీర్ అని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.