NTV Telugu Site icon

Pakistan: ప్రభుత్వం-న్యాయ వ్యవస్థ వివాదం.. చీఫ్ జస్టిస్ అధికారాల కోతపై బిల్లు.. తిప్పిపంపిన అధ్యక్షుడు..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అక్కడ ప్రజలు రోజూ గోధుమ పిండి కోసం పెద్ద యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఆహారం కోసం జరిగిన తొక్కిసలాటల్లో 20 మందికి పైగా ప్రజలు చనిపోయారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. మరోవైపు పాకిస్తాన్ కు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. ఐఎంఎఫ్ 1.1 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తోంది. ఇక మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు.

Read Also: Haldwani jail: హల్ద్వానీ జైలులో హెచ్ఐవీ కలకలం.. మహిళతో సహా 44 మంది ఖైదీలకు పాజిటివ్..

ఇదిలా ఉంటే ఆర్థిక సంక్షోభంతో రాజకీయ అస్థిరత పాక్ ను అతలాకుతలం చేస్తోంది. తాజాగా న్యాయవ్యవస్థ, ప్రభుత్వానికి మధ్య వివాదం ముదిరింది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులో మే 14న ఎన్నికలు చేపట్టాలని అక్కడి తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును అమలు చేయబోమని ప్రభుత్వం తెలిపింది. దీంతో రెండు వ్యవస్థల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాక్ పార్లమెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారాల్లో కోత పెట్టేందుకు బిల్లును తీసుకువచ్చింది.

అయితే ఈ బిల్లును ఆమోదం కోసం పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి పంపారు. అయితే దీన్ని అధ్యక్షుడు తిప్పిపంపారు. మరోసారి పున:సమీక్షించాలని కోరారు. అధికారాల్లో కోత విధించే అధికారం పాక్ సుప్రీంకోర్టుకే ఉందని ఆయన స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ అంతర్గత స్వేచ్ఛ, స్వతంత్రతల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టం చేశారు. అయితే పాక్ రాజ్యాంగం ప్రకారం పాక్ పార్లమెంట్ మరోసారి ఈ బిల్లను ఆమోదిస్తే, దానిని అధ్యక్షుడు ఆమోదించకపోయినా.. అది చట్టంగా మారుతుంది.