NTV Telugu Site icon

Pakistan: పతనం అంచున పాకిస్తాన్.. ఏడాదిలో పాతాళానికి విదేశీమారక నిల్వలు

Pakistan

Pakistan

Pakistan Economic Crisis: దాయాది దేశం పాకిస్తాన్ పతనం అంచున ఉంది. కేవలం మూడు వారాలకు మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఏడాది క్రితం 16.6 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉంటే ప్రస్తుతం కేవలం 3.1 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్న ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తోంది. ఐఎంఎఫ్ విధించే అన్ని షరతులకు తలొగ్గుతోంది. 7 బిలియన్ డాలర్ల నిధుల కోసం ఐఎంఎఫ్ తో పాకిస్తాన్ చర్చలు జరుపుతోంది.

Read Also: Pakistan PM: ఊహకు అందని విధంగా ఐఎంఎఫ్ షరతులు.. తలొగ్గక తప్పని పరిస్థితి..

పదేళ్ల కనిష్టానికి పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. బుధవారం నాటికి ఫోరెక్స్ నిల్వలు 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆ దేశ సెంట్రల్ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది. రుణ చెల్లింపులకు 592 మిలియన్ డాలర్లు విదేశీమారక నిల్వలు క్షీణించాయి. ప్రస్తుతం ఆ దేశంలోని కమర్షియల్ బ్యాంకుల వద్ద ఉన్న 5.65 బిలియన్ డాలర్లను కలుపుకుంటే మొత్తం పాక్ వద్ద 8.74 బిలియన్ డాలర్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి.

పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ నివేదిక ప్రకారం జనవరి 2022లో 16.6 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీమారక నిల్వలు జనవరి 27, 2023 నాటికి 3.1 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. పాకిస్తాన్ అప్పులు-జీడీపీ నిష్పత్తి 70 శాతం ప్రమాదకరంగా ఉంది. ఈ ఏడాది ప్రభుత్వ ఆదాయంలో 40-50 శాతం వడ్డీ చెల్లింపులకే పోతుందని రాయిటర్స్ వెల్లడించింది. పాకిస్తాన్ ద్వైపాక్షిక రుణాల్లో 27 బిలియన్ డాలర్లలో దాదాపుగా 23 బిలియన్ డాలర్లు చైనా రుణాలే ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే వంటగ్యాస్ ఎల్పీజీ ధరను 30 శాతం పెంచింది. విద్యుత్ యూనిట్ ధరను రూ. 6 పెంచాలని యోచిస్తోంది.