pakistan economic crisis: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పేకమేడలా కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు గ్యాస్, ఇంధన సంక్షోభం నెలకొంది. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, పాకిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ ప్రభుత్వాన్నే సవాల్ చేస్తున్నారు. ఇక కరెంట్ కోతలు, పిండిధరలు, గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో అక్కడి ప్రజానీకం సతమతం అవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ తయారీ పరిశ్రమలు కూడా చాాలా వరకు ప్రభావితం అవుతున్నాయి.
పాకిస్తాన్ కు భారీ షాక్ ఇచ్చాయి సుజుకీ, టయోటా కంపెనీలు. పాకిస్తాన్ నుంచి పెట్టాబేడా సర్దుకుని వెళ్లిపోతున్నాయి. పాకిస్తాన్ లో సుజుకీ మోటార్స్ సంస్థ తమ అసెంబ్లింగ్ ఫ్లాంట్ ను జనవరి 6 నుంచి మూసేస్తున్నట్లు ప్రకటించింది. జపాన్ కు చెందిన సుజుకీ సంస్థ, పాకిస్తాన్ ఆటోమోబైల్స్ కార్పొరేషన్ తో కలిసి 1983లో పాక్ సుజుకీ కంపెనీగా ఏర్పడింది.
Read Also: PM Modi: తెలంగాణలో వందే భారత్ ఎక్సప్రెస్కు పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ
ఇంతకాలం పనిచేస్తూ వచ్చిన సుజుకీ ఇప్పుడు దేశాన్ని వదిలిపెట్టి పోతోంది. భారత్ లో ఇదే సంస్థ 1981లో మారుతీ సుజుకీ పేరుతో ఏర్పాటు అయింది. అయితే పాకిస్తాన్ మాత్రం జపాన్ నుంచి విడి భాగాలు తెప్పించుకుని అసెంబ్లింగ్ మాత్రమే చేస్తోంది. అక్కడ డిజైనింగ్, తయారీ ఫ్లాంట్లు లేవు. కానీ భారత్ లోనే గత కొన్నేళ్లుగా మారుతీ సుజుకికి సంబంధించి డిజైనింగ్, తయారీ జరుగుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ జపాన్ నుంచి విడి భాగాలు తెప్పించే పరిస్థితిలో లేదు. కారణం డాలర్ల కొరత. గట్టిగా చెప్పాలంటే పాకిస్తాన్ కు కేవలం ఒక నెల దిగుమతులకు మాత్రమే విదేశీ మారకద్రవ్యం అందుబాటులో ఉంది.
టొయోటా పాకిస్తాన్ లో ‘ఇండస్ మోటార్స్’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. గతేడాది డిసెంబర్ లోనే టొయోటా పాక్ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇన్నాళ్లు దివాళా తీసే పరిస్థితి వచ్చే సరికి పాకిస్తాన్ కు ఎక్కడో చోట అప్పు పుట్టేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తోడు తీసుకున్న అప్పుకు సంబంధించి ఇన్స్టాట్మెంట్స్ కట్టాలని అని పలు అరబ్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక పాకిస్తాన్ లో ట్రాక్టర్లు తయారు చేసే ‘మిల్లెట్ ట్రాక్టర్స్’ కూడా శుక్రవారం నుంచి ఆపేస్తున్నట్లు ప్రకటించింది. డాలర్లు లేకపోవడం ఓ కారణం అయితే.. కరెంట్ కష్టాలు కూడా కంపెనీలు వెళ్లిపోవడానికి ఓ కారణం. రానున్న రోజుల్లో ఇంకెన్ని కంపెనీలు పాకిస్తాన్ నుంచి బయటకు వెళ్లిపోతాయో చూడాలి.