NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్ కార్ మార్కెట్ ఢమాల్.. దాయాదితో పోలిస్తే భారత్‌లో 100 రెట్లు ఎక్కువ అమ్మకాలు..

Pakistan

Pakistan

Pakistan: ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఆ దేశం ఉంది. దీనికి తోడు అక్కడ నిత్యావసరాలు, పెట్రోల్, విద్యుత్ ధరలు పెరగడం పాక్ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే గిల్గిట్ బాల్టిస్తాన్, పీఓకేలోని ప్రజలు తాము భారత్ లో కలుస్తామంటూ నిరసనలు చేస్తున్నారు. ఇక రాజకీయ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి పలు కార్ల కంపెనీలు వెళ్లిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కార్లు కొనేవారే కరువయ్యారు. సప్లై చైన్‌లో అంతరాలు, తక్కువ డిమాండ్ వల్ల ప్యాసింజర్ కార్ల పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది.

Read Also: Putin: పుతిన్‌ని విమర్శించిన సీనియర్ సైనిక అధికారి మృతి..

ఇండస్ట్రీ బాడీ పాకిస్తాన్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(పీఏఎంఏ) డేటా ప్రకారం, 2023 అక్టోబర్ నెలలో కేవలం 4850 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ నెలలో 6410 యూనిట్ల నుంచి కార్ల అమ్మకాలు 24.34 శాతం తగ్గిపోయాయి. 2022లో అక్టోబర్ నెలలో 11,129 యూనిట్ల కన్నా ఎక్కువ క్షీణత నమోదైంది. పాకిస్తాన్ లో ఎక్కువ అమ్ముడవుతున్న కార్లలో సుజుకి ఆల్టో, సుజుకి స్విఫ్ట్, సుజుకి బోలన్, సుజుకీ కల్టస్, టయోటా కరోలా, టయోటా యారిస్, హోండా సిటీ, హోండా సివిక్ కార్లు ఉన్నాయి.

మరోవైపు భారత్ మాత్రం ప్రతీ ఏడాది కార్ల అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఇండియా, పాకిస్తాన్ బిజినెస్‌కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. 2023 అక్టోబర్ నెలలో ఇండియాలో సుమారుగా 4 లక్షల కార్లు( 3,91,472) కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలానికి 3,36,679 యూనిట్లు విక్రయించారు. భారత్ దేశంలో లక్షల్లో కార్లు అమ్ముడవుతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం వేలల్లో కార్లు అమ్ముడవుతున్నాయి.

Show comments