Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని ఫైర్..

  • ఎర్ర సముద్రంలో సౌదీ చమురు ట్యాంకర్లపై హౌతీ దాడులు.
  • సౌదీకి అండగా నిలుస్తామన్న పాక్ ప్రధాని షరీఫ్..
  • దాడులు అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన అని పాకిస్తాన్ వ్యాఖ్య.
Pakistan

Pakistan

Pakistan: మిడిల్ ఈస్ట్‌లో అమెరికా-ఇరాన్ యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా చమురు ట్యాంకర్లపై ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. ఈ ఘటనను పాకిస్తాన్ ప్రధాని షహబాఝ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

ఇప్పటికే హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడుతోంది. ఇప్పుడు మరో బాబ్ అల్ మాండెప్ జలసంధిలో హౌతీలు దాడులు చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లోని ఓడరేవులు, ఎయిర్ పోర్టుల్ని సౌదీ అరేబియా దిగ్బంధించడం వల్లే దాడులకు పాల్పడినట్లు హౌతీలు చెబుతున్నారు.

దీనిపై పాక్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని, అంతర్జాతీయ చట్టాన్ని నేరుగా ఉల్లంఘించడమే అని అన్నారు. ఇది ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. పాకిస్తాన్ సౌదీ అరేబియాకు అండగా నిలుస్తుందని ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో తాను, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, పాకిస్తాన్ సౌదీ అరేబియాకు అండగా నిలుస్తుందని అన్నారు. ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధి, మొత్తం ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం సౌదీ అరేబియాతో, అంతర్జాతీయ సమాజంతో పాకిస్తాన్ కలిసి పనిచేస్తుందని పాక్ ప్రధాని హామీ ఇచ్చారు.