Pakistan: అవినీతి ఆరోపణలపై పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ సూచనల మేరకు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని అడియాల జైలులో పెట్టింది. గత మూడేళ్లుగా ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఇటీవల ఆయన జైలులో మరణించినట్లు వార్తలు రావడంతో, ఒక్కసారిగా పాక్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు, ఆయనను చూసేందుకు ఆయన సోదరికి అనుమతి ఇవ్వడంతో బతికే ఉన్నట్లు తెలిసింది.
Read Also: Putin: “పుతిన్ పాకిస్తాన్ ఎందుకు వెళ్లరు”.. పాక్ జర్నలిస్ట్ చెప్పిన నిజం ఏంటంటే..
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ సైన్యం శుక్రవారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘మానసిక రోగి’’గా ముద్ర వేసింది. అతడి కథనాలు జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని ఆరోపించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభోత్సవం తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ పాత ట్వీట్‌ను ఉటంకిస్తూ.. ఆయన ట్వీట్ పాకిస్తాన్ సాయుధ దళాలకు వ్యతిరేకంగా, ఉద్దేశపూర్వకంగా ఉందని జనరల్ చౌదరి అన్నారు.
ఇమ్రాన్ ఖాన్ రాజ్యాంగ బాధ్యతల కన్నా వ్యక్తిగత ఆశయాలు కలిగిన వ్యక్తిగా ఆర్మీ అభివర్ణించింది. పాక్ సాయుధ దళాలు, ప్రజల మధ్య చీలిక సృష్టించడానికి ఎవరిని అనుమతించేది లేదని అహ్మద్ షరీఫ్ చౌదరి అన్నారు. సైన్యాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హెచ్చరించారు. రాజకీయ నాయకులు సంస్థాగత సరిహద్దుల్ని గౌరవించాలని అన్నారు.
