పాకిస్థాన్ రాయబారి అహ్సాన్ వాగన్‌ను అమెరికా బహిష్కరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చెల్లుబాటు అయ్యే వీసా, అలాగే చట్టపరమైన ప్రయాణ పత్రాలు ఉన్నప్పటికీ లాస్ ఏంజిల్స్ నుంచి బహిష్కరణకు గురైనట్లు సమాచారం. అహ్సాన్ వాగన్.. తుర్క్‌మెనిస్తాన్‌లో పాకిస్తాన్ రాయబారిగా ఉన్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలస విధానంపై కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వీసాపై వివాదాస్పద సూచనలు ఉండడంతో అహ్సాన్ వాగన్‌కు చుక్కెదురైనట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: World Most Polluted Cities: కాలుష్య కోరల్లో భారతీయులు.. మొదటి 20 నగరాల్లో 13 భారత్ లోనే
తుర్క్‌మెనిస్తాన్‌లో పాకిస్తాన్ రాయబారిగా ఉన్న అహ్సాన్ వాగన్.. సెలవుపై లాస్ ఏంజెల్స్‌కు వెళ్తున్నారు. అక్రమ వలసలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలో అడ్డుకున్నారు. వీసాపై అభ్యంతరం ఉండడంతో ప్రవేశాన్ని అధికారులు అడ్డుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై సరైన కారణాలను మాత్రం అమెరికా ఇప్పటి వరకు వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: Vangalapudi Anitha Vs Botsa: బుడమేరు బాధితులకు వరద సాయంపై మండలిలో రచ్చ.. మంత్రి అనిత వర్సెస్ బొత్స..
వలసలపై అమెరికాకు అభ్యంతరం ఉండటం వల్లే అహ్సాన్ వాగన్ బహిష్కరణకు గురయ్యారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటన గురించి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, కార్యదర్శి అమీనా బలోచ్‌లకు సమాచారం అందింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ.. లాస్ ఏంజిల్స్‌లోని తన కాన్సులేట్‌ను ఆదేశించింది. జరిగిన పరిణామాలను తెలుసుకునేందుకు వాగన్‌ను ఇస్లామాబాద్‌కు తిరిగి పిలిచే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి.
వాగన్‌కు అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా పేరుంది. పాకిస్తాన్ విదేశాంగ సేవలో అనేక కీలక పదవులను నిర్వహించారు. తుర్క్‌మెనిస్తాన్ రాయబారిగా పదోన్నతి పొందే ముందు.. వాగన్ ఖాట్మండులోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో రెండవ కార్యదర్శిగా పనిచేశారు. లాస్ ఏంజిల్స్‌లోని పాకిస్తాన్ కాన్సులేట్‌లో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అయితే పాకిస్థాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు విధించిన నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Elon Musk: ఎక్స్ అంతరాయానికి ఉక్రెయినే కారణం.. మస్క్ సంచలన ఆరోపణ