NTV Telugu Site icon

Boat Sink: వలసదారులతో వెళ్తున పడవ బోల్తా.. లిబియా తీరం 60 మంది గల్లంతు..

Africa

Africa

Boat Sink: అంతర్యుద్ధాలు, తీవ్రవాదం, హింస నుంచి దూరంగా వెళ్లాలని అనుకుంటూ ప్రతీ ఏడాది కొన్ని వేల మంది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి యూరప్ ప్రాంతాలకు అక్రమంగా వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారు సముద్రంలో ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. తాజాగా మరోసారి లిబియా ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. లిబియా మధ్యదరా సముద్ర తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 61 మంది వలసదారులు గల్లంతయ్యారు. దాదాపుగా వీరంతా చనిపోయినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఉత్తర ఆఫ్రికాలో తాజాగా ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐఓఎం) శనివారం తెలిపింది.

Read Also: Chicken Prices: మాంసప్రియలకు షాక్.. రోజు రోజుకు పెరిగిపోతున్న చికెన్ ధరలు

లిబియా వాయువ్య తీరంలోని జువారా నుంచి బయలు దేరిన పడవ, సముద్రంలో అలల కారణంగా మునిగిపోయినట్లు సమాచారం. నైజీరియ, గాంబియా, ఇతర ఆఫ్రికన్ దేశాల నుంచి మహిళలు, పిల్లలతో సుమారు 86 మంది వలసదారులు నౌకలో ఉన్నట్లు ఐఓఎం పేర్కొంది. వీరిలో 61 మంది గల్లంతవ్వగా.. 25 ప్రాణాలతో బయటపడ్డారు. వీరిని లిబియా నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు ఐఓఎం తెలిపింది. లిబియా, ట్యూనీషియా మీదుగా ఇటలీ ద్వారా ఐరోపాకు చేరుకునే వలసదారుల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతోంది. ఇలా వెళ్తున్న వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ ప్రకారం, ట్యునీషియా మరియు లిబియా నుండి ఈ సంవత్సరం 1,53,000 కంటే ఎక్కువ మంది వలసదారులు ఇటలీకి చేరుకున్నారు.

మధ్యదరా సముద్రంలో ఈ ఏడాది ఇలా వెళ్లిన వారు 2250 మంది మరణించారు. జూన్ 14న నైరుతి గ్రీస్ లో 750 మందితో వెళ్తున్న ఫిషింగ్ బోట్ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సిరియా, పాకిస్తాన్, ఈజిప్టు దేశాలకు చెందిన చాలా మంది మరణించారు. కేవలం 104 మంది మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారు.