NTV Telugu Site icon

Iran: మా లక్ష్యం నెరవేరింది, ఆపరేషన్ ముగిసింది..

Israel

Israel

Iran: సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఏప్రిల్ 1న ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి, ఆ దేశానికి చెందిన కీలక జనరల్స్‌తో సహా ఏడుగురు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌‌కి చెందిన అధికారులను హతమార్చింది. అప్పటి నుంచి ఇరాన్, ఇజ్రాయిల్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. తాజాగా ఈ రోజు ఇజ్రాయిల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడిని ఇజ్రాయిల్ సమర్థవంతంగా ఎదుర్కొంది.

Read Also: Benjamin Netanyahu: “ఎవరు మాకు హాని చేయాలని చూశారో.. వారికి మేం హాని చేస్తాం”.. ఇరాన్‌కి హెచ్చరిక..

ఇజ్రాయెల్‌పై తమ డ్రోన్ మరియు క్షిపణి దాడి “తమ లక్ష్యాలన్నింటినీ సాధించిందని” ఇరాన్ సైన్యం ఆదివారం తెలిపింది. ‘‘ఆపరేషన్ హానెస్ట్ ప్రామిస్.. నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు విజయవంతంగా పూర్తైంది. దాని లక్ష్యాలను సాధించింది’’ అని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహ్మద్ బఘేరీ తెలిపారు. ఇజ్రాయిల్ సిరియా డమాస్కస్‌పై జరిపిన దాడికి ఆత్మరక్షణ కోసం ఇజ్రాయిల్‌పై దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడిలో ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సెంటర్‌ని లక్ష్యంగా చేసుకుందని, ఎక్కడి నుంచి డమాస్కస్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయిల్ F-35 జెట్‌లు బయలుదేరాయో ఆ ప్రాంతాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు బఘేరీ చెప్పారు. ఈ రెండు ప్రాంతాను ధ్వంసం చేసినట్లు చెప్పారు. అయితే, ఇజ్రాయిల్ పాక్షిక నష్టం వాటిల్లిందని చెప్పింది. ఈ ఆపరేషన్ లక్ష్యాలను సాధించిందని, దీనిని కొనసాగించాల్సిన అవసరం, ఉద్దేశం లేదని చెప్పారు. ఇరాన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండాలని ఇజ్రాయిల్‌కి పిలుపునిచ్చాడు. ఇరాన్‌కి వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌కి ఎలాంటి సాయం చేయొద్దని అమెరికాని కోరాడు.

ఇక వేళ ఇజ్రాయిల్‌కి సాయం చేస్తే అమెరికా స్థావరాలు సురక్షితంగా ఉండవని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చీఫ్ హుస్సేన్ సలామి మాట్లాడుతూ.. మా దౌత్యకార్యాలయంపై దాడి చేయడానికి ఉపయోగించిన ఇజ్రాయిల్ స్థావరాలను లక్ష్యం చేసుకున్నామని, ఇది పరిమిత ఆపరేషన్ అని చెప్పాడు. ఇది అనుకున్న దాని కన్నా విజయవంతమైందని సలామి చెప్పారు. ఇరాన్ ప్రయోజనాలను లేదా వ్యక్తులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే “ప్రతిదాడి” చేస్తానని అతను పునరుద్ఘాటించాడు.