ఇటీవల న్యూయార్క్‌లోని టాప్స్ సూపర్ మార్కెట్‌లో ఓ దుండగులు కాల్పులకు తెగబడి సుమారు 10 మందిని పొట్టన పెట్టుకున్నాడు.. అంతేకాకుండా కాల్పులు జరిపేటప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ విషాద ఘటన మరవకముందే మరో దుర్ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. తాజాగా.. అమెరికాలోని హ్యుస్టన్ బహిరంగ మార్కెట్‌లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణమే కాల్పులకు కారణమని పోలీసులు వెల్లడించారు.
ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు.. అంతేకాకుండా వారి వద్ద నుంచి తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో పాటు.. దక్షిణ కాలిఫోర్నియాలోని చర్చిలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటన కేసులో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.