Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!

Kim Jong Un

Kim Jong Un

Kim Jong Un: ప్రపంచ దేశాల హెచ్చరికలను పక్కనపెట్టి ఉత్తర కొరియా మరోసారి తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించగల రెండు రకాల సరికొత్త క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. తూర్పు తీర సముద్రంలో ఈ ప్రయోగాలు చేపట్టినట్లు నార్త్ కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. అయితే వీటిని నేరుగా సబ్‌మెరైన్ నుంచి లాంచ్ చేశారా లేక నీటి అడుగున ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రయోగించారా అనే వివరాలను మాత్రం బయటపెట్టలేదు. ఈ పరీక్షించిన ఆయుధాలను ‘వ్యూహాత్మక క్షిపణులు’గా నార్త్ కొరియా ప్రకటించింది. సాధారణంగా సైనిక పరిభాషలో ఇలాంటి పదాలను అణ్వాయుధాలు (న్యూక్లియర్ వార్‌హెడ్స్) మోసుకెళ్లే క్షిపణుల కోసమే ఉపయోగిస్తారు. సముద్రంలో తమ నౌకాదళ పోరాట సామర్థ్యాన్ని, అణు నిరోధక శక్తిని మరింత పటిష్టం చేసుకునేందుకే ఈ పరీక్షలు నిర్వహించామని ప్యాంగ్యాంగ్ పేర్కొంది. ఈ పరీక్షలపై దక్షిణ కొరియా ఆర్మీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలు చేయడం ఇదేం కొత్త కాదు. ఇటీవలే సెప్టెంబర్ 20, అక్టోబర్ 3 తేదీల్లో హైపర్‌సోనిక్ మిస్సైల్స్ పరీక్షలను నిర్వహించింది. దక్షిణ కొరియా, జపాన్‌లు ఏర్పాటు చేసుకున్న అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా ఛేదించే ఆయుధాలను సిద్ధం చేసుకోవడమే తమ లక్ష్యమని కిమ్ ప్రభుత్వం చెబుతోంది. వీటికితోడు సరిహద్దుల్లో లైవ్ ఫైరింగ్ విన్యాసాలు చేయడం, కొత్త యుద్ధనౌకలను రంగంలోకి దించడం వంటి చర్యలతో కొరియన్ సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియాతో ఎన్నో ఏళ్లుగా ఉన్న సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకున్న కిమ్, ఆ దేశాన్ని తమ ప్రధాన శత్రువుగా ప్రకటించేశారు. అటు అమెరికాతో కూడా చర్చల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 2019లో డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు విఫలమైనప్పటి నుంచి అమెరికా ఎన్ని ప్రతిపాదనలు పంపినా కిమ్ తిరస్కరిస్తూనే ఉన్నారు. తమపై శత్రుత్వ విధానాన్ని పూర్తిగా వీడటంతో పాటు, అణ్వాయుధాల రద్దు అనే షరతును ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామని నార్త్ కొరియా తేల్చి చెబుతోంది.