North Korea: ఉత్తర కొరియా తొలిసారిగా తన సైనిక నిఘా శాటిలైట్‌ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా అభ్యంతరాలను పెడచెవిన పెట్టి, కిమ్ జోంగ్ ఉన్ శాటిలైట్ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర కొరియా నిర్వహించ స్పై శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత ఇటీవల నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది.
Read Also: Virat Kohli Wicket: స్టేడియం లైబ్రరీలా మారిపోయింది.. విరాట్ కోహ్లీ వికెట్‌ను ఎప్పటికీ మర్చిపోను!
ఉత్తర కొరియా తన శాటిలైట్ ద్వారా అమెరికాలోని కీలక ప్రాంతాలైన అధ్యక్ష భవనం వైట్‌హౌజ్, రక్షణ రంగ భవనమైన పెంటగాన్ చిత్రాలను తీసిందని నార్త్ కొరియా పేర్కొంది. ఏఏ ప్రాంతాలను ఫోటోలు తీసిందనే వివరాలను ప్రముఖ యూఎస్ సైట్ పేర్కొంది. రోమ్, గువామ్ లోని అండర్సర్ ఎయిర్‌ఫోర్స్ బేస్, పెరల్ హార్బర్, యూఎస్ నేవీకి చెందిన కార్ల్ విన్సన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫోటోలను తీసిందని వెల్లడించింది. ఈ చిత్రాలను నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చూశాడని ఆ దేశ మీడియా ఇటీవల పేర్కొంది.
ఇప్పటికే అణ్వాస్త్ర ప్రయోగాలు, క్షిపణి ప్రయోగాలతో అమెరికా, సౌత్ కొరియా, జపాన్ దేశాలకు నార్త్ కొరియా ఛాలెంజ్ విసురుతోంది. ఈ నేపథ్యంలో శాటిలైట్ ప్రయోగం సఫలం కావడంతో అత్యంత ఖచ్చితత్వంతో అణదాడి చేసే సామర్థ్యాన్ని నార్త్ కొరియా పెంచుకుంది. ట్యూనింగ్ ప్రాసెస్ ముగిశాక, డిసెంబర్ 1 నుంచి స్పై శాటిలైట్ తన నిఘా మిషన్ ప్రారంభిస్తోందని ఆ దేశం వెల్లడించింది. అయితే ఉపగ్రహం ఎలా పనిచేస్తుందో అనే వివరాలను ఏ దేశం కూడా నిర్థారించలేదు. నార్త్ కొరియా కూడా శాటిలైట్ తీసిన ఫోటోలను బయటపెట్టలేదు.
