మనిషి ఏ నొప్పినైనా భరించగలడు గానీ ఆకలి బాధను భరించలేడు. ఉదయం కొంచెం లేటుగా టిఫిన్ చేస్తేనే నీరస పడిపోతారు. స్పృహ తప్పి పడిపోతారు. అలాంటిది కొద్ది నెలలుగా గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు తిండి లేక నీరసించిపోతున్నారు. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కూడా వదులుతున్నారు. తాజాగా ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
గతేడాది అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం ఇజ్రాయెల్.. హమాస్ లక్ష్యంగా గాజాపై భీకర యుద్ధం సాగించింది. మొత్తం గాజాను నేలమట్టం చేసింది. దీంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. అప్పటి నుంచి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కొన్ని స్వచ్చంధ సంస్థలు ఆహార పంపిణీ చేసినా కొరత మాత్రం తీరలేదు. దీంతో అర్థాకలితోనే ప్రజలు కాలం వెళ్లబుచ్చుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ పరిస్థితి అక్టోబర్‌లో మరింత తీవ్రంగా మారింది. ఈనెల ప్రారంభం నుంచి ఉత్తర గాజాలోకి ఎటువంటి ఆహారం ప్రవేశించలేదు. దీంతో తిండి దొరకకా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం నేతలు (WFP) చెబుతున్నారు. ఆగస్ట్‌లో దాదాపు 700 సహాయ ట్రక్కులు ఉత్తర గాజాకు చేరుకున్నాయి. అయితే ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ మరియు జోర్డాన్ మధ్య అలెన్‌బై క్రాసింగ్‌లో వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాత సెప్టెంబరులో 400 ట్రక్కులు మాత్రమే వచ్చాయి. ఇక అక్టోబర్‌లో అయితే ఇప్పటివరకు ఎలాంటి ఫుడ్ ట్రక్కులు ప్రవేశించలేదని డబ్ల్యూఎఫ్‌పీ పేర్కొంది. గాజాలో ఆకలి బలంగా ఉందని.. కరవు ముప్పు మరింత కొనసాగుతుందని తెలిపింది. తక్షణమే సహాయ కార్యక్రమాలు కొనసాగకపోతే ఒక మిలియన్ ప్రజల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిపింది.
హమాస్ మళ్లీ తన కార్యక్రమాలు ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ అక్టోబర్ 6 నుంచి ఉత్తర గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశించింది. అయితే ప్రజలు ఇళ్లులు ఖాళీ చేయడం లేదు. ఇంకోవైపు హమాస్ మిలిటెంట్లు నివాసాలనే సేఫ్ జోన్లుగా ఎంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హమాస్‌ను అంతమొందించే కార్యక్రమంలో భాగంలో దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఆహార పంపిణీ కార్యక్రమం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.