Site icon NTV Telugu

Trump-Nicolas Maduro: కిడ్నాప్‌కు మందు మదురోకు ఎలాంటి ఆఫర్లు వచ్చాయి? చివరికేమైంది?

Nicolas Maduro

Nicolas Maduro

జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయింది. మదురోతో పాటు ఆయన భార్యను పట్టుకెళ్లిపోయారు. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. అయితే కిడ్నాప్‌కు ముందు ఏం జరిగిందో.. రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో.. అందుకు సంబంధించిన కీలక సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నికోలస్ మదురోను కిడ్నాప్‌ చేసే ముందు నికోలస్ మదురోకు కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ ఆ ఆఫర్లను నికోలస్ మదురో తిరస్కరించినట్లుగా నివేదికలు అందుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో వెనిజులాను హెచ్చరిస్తున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఆపాలని వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు. నికోలస్ మదురో నేతృత్వంలోనే డ్రగ్స్ రవాణా జరుగుతోందని ఆరోపించారు. కానీ నికోలస్ మదురో అవేమీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో నికోలస్ మదురోతో ట్రంప్ ఫోన్ సంభాషణ చేశారు. ఈ ఫోన్ కాల్‌తో మంచి సదుప్రాయమే ఉన్నట్లుగా మదురో తప్పుగా భావించారు. ఆ ఆలోచనతోనే తనకేమీ కాదని భ్రమపడ్డాడు. కానీ మదురో కిడ్నాప్ విషయం ఇతరులకు చేరిపోయింది. ఈ క్రమంలోనే నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించే ముందు ఆయన్ను సురక్షితంగా బయటపడే అవకాశం కల్పించడానికి అంతర్జాతీయంగా ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఆ ప్రయత్నాలు విఫలమైనట్లుగా నివేదికలను బట్టి అర్థమవుతోంది.

క్రిస్మస్ నాడు వాటికన్‌లో ఒక అత్యవసర దౌత్య కార్యక్రమం జరిగినట్లుగా తెలుస్తోంది. వాటికన్ విదేశాంగ కార్యదర్శి, అనుభవజ్ఞుడైన దౌత్య మధ్యవర్తి కార్డినల్ పియట్రో పరోలిన్.. హోలీ సీలోని అమెరికా రాయబారి బ్రియాన్ బుర్చ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్ ప్రణాళికలపై స్పష్టత ఇవ్వాలని కార్డినల్ పరోలిన్ కోరారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను మాత్రమే అమెరికా లక్ష్యంగా చేసుకుంటుందా లేదా పరిపాలన మార్పు అంతిమ లక్ష్యమా అని అడిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కార్డినల్ పరోలిన్ కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో నికోలస్ మదురోకు రష్యా ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉందని బ్రియాన్ బుర్చ్‌కు కార్డినల్ వెల్లడించారు. మదురోను రక్షించేందుకు రష్యన్లు, ఖతారీలు, టర్కీలు, కాథలిక్ చర్చి, ఇతరులు చాలా ప్రయత్నించారు. కానీ మదురో అవేమీ పట్టించుకోలేదని నివేదికలు అందుతున్నాయి. ఒక వారం తర్వాత అమెరికన్ స్పెషల్ ఆపరేషన్స్ దళాల దాడిలో మదురో, అతని భార్యను కిడ్నాప్ చేశారు. అమెరికా తనను కిడ్నాప్ చేస్తుందని నికోలస్ మదురో గ్రహించలేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

Exit mobile version