భారత్ నుంచి వెళ్లే వాళ్లపై అమలు చేస్తున్న కఠిన నిబంధనల్ని ఎత్తి వేసింది బ్రిటన్. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంటే కారణమని భావిస్తోంది బ్రిటన్. ఈ క్రమంలో మన దేశం నుంచి వెళ్లే వాళ్ల ద్వారా తమ పౌరులు కరోనా సోకుతుందంటూ ఇటీవల లేనిపోని భయాలు వ్యక్తం చేసింది. బ్రిటన్‌లో అనుమతి పొందిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా టీకాను మన దగ్గర కోవీషీల్డ్ పేరుతో ఇస్తున్నారు. కానీ… కోవీషీల్డ్ రెండు డోసులు తీసుకున్నా సరే విమానం ఎక్కేముందు RT-PCR పరీక్ష చేయించుకోవాల్సిందే అంటోంది బ్రిటన్. అలాగే, భారత్ నుంచి తమ దేశానికి వచ్చిన వాళ్లకు పది రోజుల పాటు కఠిన క్వారంటైన్ అమలు చేయడంపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది.
బ్రిటన్ అనుసరిస్తున్న విధానంపై భారత్ సహా పలు దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితుల్లో కొత్త నిబంధనలు జారీ చేసింది బ్రిటన్. తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం భారత్ నుంచి బ్రిటన్‌కు వెళ్లిన వాళ్లకు విమానం ఎక్కేటప్పుడు RT-PCR టెస్టు అక్కర్లేదు. బ్రిటన్‌లో కాలుమోసిన రెండో రోజున కరోనా టెస్టు చేయించుకుంటే సరిపోతుంది. అయితే, కోవీషీల్డ్ వ్యాక్సీన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లకు మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుంది. బ్రిటన్ ఇంత వరకూ ఫైజర్-బయో N-టెక్, మోడర్నా, యాన్సెస్, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా వ్యాక్సీన్లను మాత్రమే గుర్తించింది. ఇవి కాకుండా ఇతర కరోనా వ్యాక్సీన్లు తీసుకున్న వాళ్లకు బ్రిటన్ విమానం ఎక్కే ముందు RT-PCR పరీక్ష చేయించుకుని, నెగటీవ్ వచ్చినట్టు చూపించాల్సి ఉంటుంది. కరోనా వ్యాప్తి అధికంగా గల రెడ్ లిస్ట్ దేశాలకు ఇది వర్తిస్తుంది. అలాగే, రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చిన వాళ్లు బ్రిటన్‌కు చేరుకున్నాక తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. మన దేశంలో కోవీషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వాళ్ల సర్టిఫికెట్‌ను కరోనా పాస్‌పోర్టుగా బ్రిటన్ గుర్తించకపోవడం పట్ల ఇటీవల ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన పంతాలు నెలకొన్నాయి. బ్రిటన్ నుంచి వచ్చే వాళ్లపై భారత్ కూడా కఠిన ఆంక్షలు విధించింది. దీంతో దిగివచ్చిన బ్రిటన్ భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికుల విషయంలో నిబంధనల్ని సడలించింది.