Israel: వెస్ట్ బ్యాంక్‌లో భారీ ఆపరేషన్‌కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన

  • వెస్ట్ బ్యాంక్‌లో భారీ భద్రతా ఆపరేషన్..
  • సంచలన వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యామూ..
  • గ్రామాల్లో సోదాలు, అనుమానితుల అరెస్టుకు ఆదేశాలు..
Netanyahu

Netanyahu

Israel: ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో భారీ భద్రతా ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ సైనిక చర్యలు మరింత తీవ్రం కానున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో సోదాలు నిర్వహించడం, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, అనుమానితుల్ని అరెస్ట్ చేయాలని భద్రతా బలగాలను నెతన్యామూ ఆదేశించారు. ఉగ్రవాద స్థావరాలపై సమగ్ర చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయిల్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో నెతన్యాహూ ఈ ప్రకటన చేయడం చూస్తే, రాబోయే రోజుల్లో సైనిక ఆపరేషన్స్ ముమ్మరం అయ్యేటట్లు కనిపిస్తోంది. మరోవైపు, ‘యూత్ అగైనెస్ట్ సెటిల్‌మెంట్స్’ వ్యవస్థాపకుడు ఇస్సా అమ్రో మాట్లాడుతూ, ఆక్రమిత ప్రాంతాల్లో నివసిస్తున్న పాలస్తీనీయులు ప్రతిరోజూ హింసను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తమ ఇళ్లు, భూములు, కుటుంబాలను రక్షించుకునేందుకు ప్రయత్ని్స్తున్న వారిపై దాడులు, నిర్బంధాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవల ఏళ్లలో 20కి పైగా పాలస్తీనా గ్రామాలు ఖాళీ అయ్యాయని, వందలాది కుటుంబాలు నివాసాలను విడిచి పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. దీనిని ‘‘జాతి ప్రక్షాళన’’గా అభివర్ణించారు.