Site icon NTV Telugu

Nepal Palace Massacre: ప్రేమకు బలైన నేపాల్ రాజ కుటుంబం.. ప్యాలెస్‌లో ఊచకోత.. ఆ నాటి విషాద గాథ

Nepal Massacre

Nepal Massacre

Nepal Palace Massacre: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలకు తలొగ్గి ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయన మంత్రివర్గంలోని పలువురు మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. ఇప్పుడు నేపాల్‌లో మరోసారి రాచరికం మళ్లీ వస్తుందా అనే వాదన మొదలైంది. చాలా మంది నేపాలీలు మరోసారి రాజు పాలన రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, 2001లో ఆ దేశాన్ని కుదిపేసిన రాజకుటుంబం ఊచకోత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనే, నేపాల్‌లో రెండు శతాబ్ధాల రాచరికానికి అంతం పలికేలా చేసింది. 2008లో రాచరికం ముగిసి, ప్రజాస్వామ్యం వచ్చింది.

నారయణహితి ప్యాలెస్‌లో ఏం జరిగింది..?

అది జూన్ 1, 2001 రాజ కుటుంబం ఖాట్మాండులోని నారాయణహితి ప్యాలెస్‌లో సమావేశమైంది. ప్రతీ శుక్రవారం ఇలా రాజ కుటుంబం గెటు టూ గెదర్‌లో కలుసుకోవడం ఒక అనవాయితీగా ఉంది. ఇలాగే ఆ రోజు కూడా రాజకుటుంబం చాలా ఉల్లాసంగా పార్టీ చేసుకున్నారు. అయితే, ఆ సాయంత్రమే రాజ కుటుంబం, తమ సొంత యువ రాజు చేతిలో ఊచకోతకు గురవుతామని ఊహించలేదు.

ఈ పార్టీకి నేపాల్ రాజు బీరేంద్ర బిర్ బిక్రమ్ షా దేశ్ హాజరయ్యారు. ఆయనే దేశాన్ని పాలిస్తున్నారు. హర్వర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన బీరేంద్ర, భారత్‌లోని డార్జిలింగ్‌లో కూడా చదువుకున్నారు. ఆయన 1970లో ఐశ్వర్య రాజ్యలక్ష్మిదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం- యువరాజు దీపేంద్ర, రాజ కుమార్తె శృతి, చిన్న కుమారుడు నిరాజన్.

అంతా పార్టీలో మునిగి ఉండగా యువరాజు బీరేంద్ర(29) తాగి కనిపించారు. ఆయనను ఓ గదిలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని, కమాండో డ్రెస్ ధరించి రైఫిల్ చేతపట్టుకుని పార్టీ జరిగే ప్రదేశానికి వచ్చారు. తన తండ్రి, రాజు అయిన బీరేంద్రను చూస్తూ, ఎలాంటి భావోద్వేగం లేకుండా అసాల్ట్ రైఫిల్‌తో కాల్చి చంపాడు. రాజు బీరేంద్ర చనిపోతూ, ‘‘ఏం చేశావు..?’’ అంటూ నేలపై ఒరిగిపోయాడు. దీపేంద్ర తన తల్లి ఐశ్వర్య, సోదరి శృతి, సోదరుడు నిరాజన్‌లతో పాటు మరో ఐదుగురిని కాల్చి చంపాడు. చివరకు తను తానున కాల్చుకున్నాడు. తుపాకీ గాయంతో కోమాలోకి వెళ్లిన దీపేంద్రను తాత్కాలికంగా రాజుగా ప్రకటించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత జూన్ 04న మరణించాడు. దీని తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర రాజుగా బాధ్యతలు స్వీకరించారు. 2008లో రాజ్యాంగం మారి రాచరికం రద్దయ్యే వరకు ఆయనే చివరి రాజుగా ఉన్నారు.

ప్రేమ కోసమే ఉచకోత, భారత్‌తో సంబంధం:

ప్రభుత్వం ఈ ఊచకోతపై చేపట్టిన విచారణలో దీపేంద్ర ‘‘ప్రేమ కథ’’నే ఈ ఘటనకు కారణమని తెలిసింది. దీపేంద్ర-దేవయానిల రాణా అనే యువతిని ప్రేమించాడు. దేవయాణి నేపాల్ రాజకీయవేత్త పశుపతి షంషేర్ జంగ్ బహదూర్ రాణా కుమార్తె. ఆమె తల్లి ఉషా రాజే సింధియా. గ్వాలియర్ రాజవంశానికి చెందిన వారు. మనదేశానికి చెందిన రాజకీయనాయకులు మాధవరావు సింధియా, వసుంధర రాజేకు బంధువులు.

దీపేంద్ర, దేవయాని యూకేలో కలుసుకున్నారు. కానీ రాజ కుటుంబం ఈ ప్రేమకు అడ్డు చెప్పింది. ముఖ్యంగా దీపేంద్ర తల్లి, రాణి అయిన ఐశ్వర్య ఈ సంబంధాన్ని ఒప్పుకోలేదు. ఒక వేళ దేవయాణిని పెళ్లి చేసుకుంటే యువరాజు హోదాను వదులుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. వేరే రాజ వంశానికి చెందిన అమ్మాయితో కొడుకు దీపేంద్ర వివాహం జరిపించాలని ఐశ్వర్య భావించింది. భారతదేశానికి చెందిన రాజకుటుంబంతో సంబంధం కలుపుకుంటే, ఆ దేశ ప్రభావం తమపై ఎక్కువగా ఉంటుందని రాజ కుటుంబ భయపడినట్లు మరో కారణంగా చెబుతారు. ప్రేమ, రాజకీయం, అధికారం అన్ని కలిసిన నేపాల్ రాజ కుటుంబం ఊచకోత ప్రపంచంలోనే ఆ రోజుల్లో సంచలనంగా మారింది.

Exit mobile version