నేపాల్‌లో 22 మందితో ప్రయాణిస్తున్న తారా ఎయిర్ విమానం మిస్సింగ్ విషాదం మిగిల్చింది. ఈ విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు పోఖారాలో టేకాఫ్ తీసుకుంది. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఈ విమానం ఆచూకీ కోసం అధికారులు తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు. చివరకు లాంచే నది సమీపంలో ఈ విమానం కూలిపోయినట్టు అధికారులు నిర్ధారించారు.
తారా ఎయిర్‌కు చెందిన ట్విన్ ఓటర్ 9N AET విమానం పోఖారా నుంచి ఆదివారం ఉదయం 9:55 గంటలకు బయలుదేరిందని.. అయితే 10:07 గంటలకు విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ఈ విమానంలో 22 మంది ఉండగా అందులో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ వాసులతో పాటు 15 మంది నేపాలీ వాసులు కూడా ఉన్నారని వెల్లడించారు. అధికారులు జీపీఎస్ నెట్‌వర్క్ ద్వారా విమానం కెప్టెన్ ప్రభాకర్ జిమిరే సెల్‌ఫోన్‌ను నేపాల్ టెలికాం విభాగం ట్రాక్ చేసి విమానం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేశారని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం జనరల్ మేనేజర్ ప్రేమ్ నాథ్ ఠాకూర్ తెలియజేశారు.