NTV Telugu Site icon

Sheikh Hasina: నెలల ముందు షేక్ హసీనా అంచనా..‘‘తెల్లవారి’’ కుట్ర నిజమైందా..?

Sheikh Hasina

Sheikh Hasina

Sheikh Hasina: ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని దించేందుకు ‘‘శ్వేత జాతీయులు’’ కుట్ర పన్నారని ఆరోపించింది. అయితే, ఆమె వ్యాఖ్యలు కొన్ని నెలలకే నిజమయ్యాయి. ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశాన్ని వదిలి పారిపోయేలా చేశారు. తన తండ్రి, బంగ్లా జాతిపితగా పేరున్న షేక్ ముజిబుర్ రెహమాన్‌లా తనను హత్య చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి కొత్తగా ‘‘క్రైస్తవ దేశం’’ ఏర్పాటుకు ‘‘శ్వేత జాతీయులు’’ కుట్ర పన్నారని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.

Read Also: Bangladesh: షేక్ హసీనాపై యూకే వేదికగా పాక్, చైనా కుట్ర.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్..

జనవరిలో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా మరోసారి భారీ విజయం సాధించారు. ప్రతిపక్ష, ఖలిదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) ఈ ఎన్నికల్ని బహిష్కరించింది. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరాన్ని నిర్మించేందుకు ఒక విదేశాన్ని తాను అనుమతించకపోవడంతోనే ఇబ్బందులు పెడుతున్నారని ఆమె అన్నారు. ఆ దేశాన్ని అనుమతించినట్లైతే తనకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పారు. చాలా మంది విదేశీయులు బంగ్లాదేశ్‌పై దృష్టి పెట్టారని, బంగాళాఖాతంలో (ఛటోగ్రామ్), మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలతో తూర్పు తైమూర్ లాగా కొత్త క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేస్తారని ఆమె అన్నారు. తాను ఎవరి ఒత్తిళ్లకు తలవంచబోనని చెప్పారు.

స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం ఆమె పదవి కోల్పోవడానికి కారణమైంది. విద్యార్థులు దీనికి వ్యతిరేకంగా నిరసన తెలపడం, అవి కాస్త హింసాత్మక ఘటనలకు కారణం కావడంతో 300 మంది మరణించారు. తాజాగా ఆదివారం మరోసారి హింస చెలరేగడంతో, ఆ దేశ ఆర్మీ చీఫ్ షేక్ హసీనాకు 45 నిమిషాల అల్టిమేటం జారీ చేయడంతో ఆమె పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చేంసింది. ఇక్కడ నుంచి లండన్ వెళ్లి ఆశ్రయం పొందాలని అనుకుంటోంది.

Show comments