ప్రపంచంలో మంకీపాక్స్ వైరస్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే డజన్ పైగా దేశాల్లో కేసులను కనుక్కున్నారు. తాజాగా మరో రెండు దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ), చెక్ రిపబ్లిక్ దేశాల్లో కొత్తగా మంకీపాక్స్ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ ఆఫ్రికా నుంచి యూఏఈకి వచ్చిన ఓ మహిళలో వైరస్ ను నిర్థారించారు. బెల్జియం నుంచి చెక్ రిపబ్లిక్ కు వచ్చిన ఓ మహిళలో వైరస్ ను కనుక్కున్నారు. చెక్ రిపబ్లిక్ లో ఇప్పటి వరకు 3 కేసులు నమోదు అయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం యూఏఈలో కనుక్కున్న కేసుతో అరేబియా ద్వీపకల్పంలో నమోదైన మొదటి కేసుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వ్యాధి వెలుగులోకి వచ్చింది. దాదాపుగా 237 మందికి మంకీపాక్స్ సోకినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఐరోపాలోని అనేక దేశాల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ నెల 7న మొదటిసారిగా బ్రిటన్ లో ఓ వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి సోకినట్లు అక్కడి అధికారులు నిర్థారించారు. ప్రస్తుతం బ్రిటన్ లోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.అయితే మొదటిసారిగా ఆఫ్రికా వెళ్లకుండా వచ్చిన వారికి కూడా వ్యాధి సోకినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ప్రపంచంలోని వివిధ దేశాలకు మంకీపాక్స్ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇది కోవిడ్ అంత వేగంగా వ్యాపించే వ్యాధి కాకున్నా… సాధారణం అయింది మాత్రం కాదని హెచ్చరించింది. కాగా వ్యాధిని అరికట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, బెల్జియం, ఫ్రాన్స్, యూఏఈ, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయిల్, యూకే, యూఎస్ఏ, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్ దేశాల్లో కేసులు నమోదయ్యాయి. 1970లో కాంగోలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక యువకుడికి మొదటిసారిగా మంకీపాక్స్ వైరస్ సోకింది