NTV Telugu Site icon

Monkeypox: మంకీపాక్స్ కలవరం.. 11 దేశాల్లో కేసులు నమోదు

Monkeypox Virus

Monkeypox Virus

ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా మంకీపాక్స్ వైరస్ కలవరం రేపుతోంది. ఇన్నాళ్లు కరోనాతో సతమతం అయిన ప్రపంచం ముందు మంకీపాక్స్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. బ్రిటన్ లో వెలుగు చూసిన ఈ వ్యాధి నెమ్మనెమ్మదిగా ఇతర దేశాల్లో కూడా బయటపడుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కలవరం మొదలైంది. ఇప్పటికే కరోనా వ్యాధి పూర్తి స్థాయిలో సద్దుమణగక ముందే మంకీపాక్స్ రూపంలో మరో వ్యాధి విస్తరిస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి.

పెరుగుతున్న మంకీపాక్స్ వ్యాధి వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూఎచ్ఓ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ వ్యాధి విస్తరణపై చర్చించింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఇప్పటివరకు ప్రపంచంలో 11 దేశాల్లో మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. మొత్తంగా ఇప్పటి వరకు 80 కేసులను ధ్రువీకరించగా… మరో 50 కేసులు పరిశీలనలో ఉన్నాయి.

యూకే, యూఎస్, పోర్చుగల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బెల్జియం, స్వీడన్, స్పెయిన్, ఆస్ట్రేలియా దేశాల్లో మంకీపాక్స్ వ్యాధిని గుర్తించారు. స్మాల్ పాక్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాలే మంకీపాక్స్ లో కనిపిస్తుంటాయి. ఒళ్లంతా దద్దుర్లు రావడంతో పాటు లింప్ నోడ్స్ వాయడం, ఫ్లూ వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. అయితే 2-4 వారాల్లో వ్యాధి దానికదే తగ్గిపోతుంది. చాలా వరకు సీరియస్ పరిస్థితులు రావని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే మంకీ పాక్స్ పై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. మంకీపాక్స్ వ్యాప్తి కారణంగా అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్,  ఐసీఎంఆర్ కి ఆదేశాలు జారీ చేసింది. విదేశాలలో మంకీపాక్స్ పరిస్థితిని నిశితంగా గమనించాలని… ప్రభావిత దేశాల వచ్చే అనారోగ్యంతో ఉన్న ప్రయాణీకులను వేరుచేసి, వారి నమూనాలను పరీక్షల కోసం నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణేకు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.