ఇజ్రాయెల్‌లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటన కోసం బుధవారం ఇజ్రాయెల్ వెళ్లారు. టెల్ అవీవ్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మోడీకి ప్రసంగం చేసే అవకాశం దక్కింది. అంతేకాకుండా అరుదైన గౌరవం కూడా దక్కింది. మోడీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవమైన స్పీకర్ అఫ్ ది నెస్సెట్ మెడల్ ప్రదానం చేసింది.
ఇక ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మోడీ మాట్లాడుతున్నప్పుడు ఆద్యంతం అభినందలు లభించాయి. ఎంపీలంతా చప్పట్లతో గౌరవించారు. ఇక ఈ సందర్భంగా భారత్ మేజర్ దల్పత్ సింగ్ షెకావత్‌ను మోడీ గుర్తుచేశారు. మొదటి ప్రపంచ యుద్ధ వీరుడిగా కొనియాడారు. ‘‘హైఫా హీరో’’గా అభివర్ణించారు. దల్పత్ సింగ్ షెకావత్.. భారతదేశం-ఇజ్రాయెల్ ఉమ్మడి చరిత్ర, త్యాగానికి చిహ్నంగా మోడీ అభివర్ణించారు. ఇజ్రాయెల్‌తో భారతదేశానికి ఉన్న సంబంధం కేవలం దౌత్యపరమైనది కాదని.. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలను త్యాగం చేసిన 4,000 మందికి పైగా భారతీయ సైనికుల రక్తంతో తడిసిందని ప్రధాని మోడీ గుర్తుచేశారు.
ఇంతకీ దల్పత్ సింగ్ ఎవరు?
దల్పత్ సింగ్ షెకావత్.. భారత్ మేజర్. దల్పత్ సింగ్ రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని డియోలి అనే చిన్న గ్రామంలో జనవరి 26, 1892న జన్మించారు. రావణ రాజ్‌పుత్‌ల షెకావత్ కుటుంబానికి చెందినవాడు. ఆ సమయంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. దల్పత్ సింగ్ జోధ్‌పూర్ మహారాజా సైన్యంలో మేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1910లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి బ్రిటిష్ సైన్యంలో మేజర్ హోదాను పొందారు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దల్పత్ సింగ్ 1918లో ఒట్టోమన్- జర్మన్ దళాల నుంచి ఇజ్రాయెల్‌లోని హైఫా నగరాన్ని కాపాడాడు. జోధ్‌పూర్ లాన్సర్స్ నేతృత్వంలోని భారత సైనికులు కత్తులు-ఈటెలతో యుద్ధంలో గెలిచారు. తన అజేయ ధైర్యసాహసాలతో హైఫా నగరాన్ని శత్రువుల నుంచి దల్పత్ సింగ్ షెకావత్ విముక్తి చేశాడు.
కేవలం 26 సంవత్సరాల వయస్సులో యుద్ధానికి నాయకత్వం వహిస్తూ దల్పత్ సింగ్ షెకావత్ మరణించాడు. నేటికీ భారత సైన్యం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న ‘హైఫా దినోత్సవం’ జరుపుకుంటుంది. దల్పత్ సింగ్ షెకావత్ వీరత్వం గురించిన కథను ఇజ్రాయెల్ పాఠశాలల్లో ఇప్పటికీ బోధిస్తారు.
