భవిష్యత్తులో అమెరికాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే అధ్యక్షుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులు ఎదురైతే దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్‌తో పాటు లాటిన్ అమెరికా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌కు మద్దతు పెంచుకోవడంతో పాటు ఇతర దేశాలతో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న జరగనున్న ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జరిగిన ఓ కార్యక్రమంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేసినట్లు కథనం పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెతన్యాహుకు మద్దతు ప్రకటించడానికి కొన్ని గంటల ముందే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరో రెండేళ్లలో అమెరికాలో ఇజ్రాయెల్ పట్ల తీవ్ర వ్యతిరేకత కలిగిన అధ్యక్షుడు అధికారంలోకి రావచ్చని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఆయన పురుషుడైనా, మహిళ అయినా ఇజ్రాయెల్‌కు ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇప్పటి నుంచే ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా నుంచి లభించే సైనిక సహాయం, వ్యూహాత్మక మద్దతుపై భవిష్యత్తులో అనిశ్చితి ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ట్రంప్ అధ్యక్ష పదవీకాలంలో మిగిలిన రెండేళ్లను ఇజ్రాయెల్ తన ప్రయోజనాలను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. ఆ తర్వాత అమెరికా విధానాల్లో మార్పులు వచ్చినా వాటిని ఎదుర్కొనేలా సిద్ధం కావాలని పేర్కొన్నారు. అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంతో పాటు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కృషి చేయాలని నెతన్యాహు అన్నారు.
ఇజ్రాయెల్ తన అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరించుకోవాలని నెతన్యాహు స్పష్టం చేశారు. భారత్ వంటి పెద్ద దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం ఈ వ్యూహంలో కీలకమని పేర్కొన్నారు. తాను ఇప్పటికే మధ్యప్రాచ్యంలోని పలు దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని దేశాలతోనూ సంబంధాల విస్తరణపై పనిచేస్తున్నట్లు తెలిపారు. లాటిన్ అమెరికాలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కూడా ఇజ్రాయెల్‌కు కొత్త అవకాశాలను కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. బ్రెజిల్లో కొద్ది రోజుల్లోనే భారీ రాజకీయ మార్పులు సంభవించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నట్లు కథనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలతో భాగస్వామ్యాలను పెంచుకోవడంతో పాటు, ఇతర దేశాలకు కూడా ఉపయోగపడే సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని నెతన్యాహు అన్నారు.
మోడీతో స్నేహం
ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత పెరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో నెతన్యాహు భారత్‌తో ఉన్న సంబంధాలను తరచూ ప్రస్తావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో తనకున్న స్నేహాన్ని, ఇరు దేశాల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని తన ప్రభుత్వ దౌత్య విజయాలకు ఉదాహరణగా చూపిస్తున్నారు. మే నెలలో చేసిన ఓ ప్రకటనలో భారత్‌తో ఇజ్రాయెల్‌కు ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయని, భారత్‌లో ఇజ్రాయెల్‌పై అపారమైన అభిమానం ఉందని నెతన్యాహు పేర్కొన్నట్లు కథనం గుర్తుచేసింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై వస్తున్న విమర్శల మధ్య భారత్‌తో సంబంధాలను ప్రస్తావించడం ద్వారా తమ దేశానికి అంతర్జాతీయ మద్దతు ఉందని చాటిచెప్పేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
డెమోక్రాట్లతో నెతన్యాహుకు విభేదాలు
అమెరికాలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన నేతల్లో ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత పెరగడానికి నెతన్యాహు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని ఇజ్రాయెల్‌లోని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. జీ అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్‌లతో నెతన్యాహు సంబంధాలు పలు సందర్భాల్లో ఉద్రిక్తంగా ఉండేవి. అయితే అమెరికా అధ్యక్షులతో విభేదించడానికి కూడా వెనుకాడని బలమైన నాయకుడిగా తనను తాను ఆయన మద్దతుదారుల ముందు ప్రదర్శించుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాతో విభేదాలు వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ ప్రయోజనాల విషయంలో రాజీ పడని నేతగా తన ప్రతిష్ఠను నిర్మించుకోవడం నెతన్యాహు ఎన్నికల ప్రచారంలో కీలక అంశంగా మారిందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యూహం ఆయనకు రాజకీయంగా విజయాన్ని అందించిందని, ఇజ్రాయెల్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నేతగా నిలవడానికి దోహదపడిందని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా.. భవిష్యత్తులో అమెరికా విధానాలు మారినా ఇజ్రాయెల్ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా భారత్ సహా ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై నెతన్యాహు దృష్టి సారించినట్లు ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

