Pakistan: భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, భారత్‌పై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. ఇటీవల, రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత, బంగ్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దైవదూషణ ఆరోపణలతో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది.
Read Also: Kandula Durgesh: కొత్త సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై మంత్రి కందుల దర్గేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌పై భారత్ దాడి చేస్తే సైనిక ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ పాలక ముస్లిం లీగ్ పార్టీకి చెందిన నాయకుడు కమ్రాన్ సయీద్ ఉస్మానీ ఒక వీడియోలో వార్నింగ్ ఇచ్చాడు. ఢాకాపై న్యూఢిల్లీ ఏదైనా చర్య తీసుకుంటే, పాకిస్తాన్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని అన్నారు. బంగ్లాదేశ్ సార్వభౌమత్వంపై భారత్ దాడి చేస్తే, ఎవరైనా బంగ్లాదేశ్ వైపు చెడు దృష్టి పెట్టడానికి ధైర్యం చేస్తే, పాకిస్తాన్ ప్రజలు, పాక్ సైన్యం, పాక్ క్షిపణులు చాలా దూరంలో లేవని గుర్తుంచుకోండి అంటూ భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతంలో భారత్ చేస్తున్న కుట్రల పట్ల ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని ఉస్మాని పేర్కొన్నారు. అఖండ భారత్ భావజాలాన్ని బంగ్లాదేశ్‌పై రుద్దే ప్రయత్నాన్ని పాక్ ప్రతిఘటిస్తుందని ఆయన అన్నారు.
షేక్ హసీనా గతేడాది ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, మహ్మద్ యూనస్ ప్రభుత్వం పూర్తిగా భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. అక్కడి కొందరు విద్యార్థి నాయకులు భారత్‌ను విడగొడతామని, ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల, హాది మరణం తర్వాత ఢాకాలోని భారత ఎంబసీపై రాడికల్ మూక దాడికి యత్నించింది. ఇక యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి.