Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు 05న ప్రజల చేత ఎన్నికైన షేక్ హసీనా పదవీచ్యుతురాలైంది. ఆ తర్వాత ఆమె ఇండియాకు పారిపోయి వచ్చింది. ఆ తర్వాత బంగ్లా చీఫ్‌గా యూనస్ పదవీ చేపట్టారు. ఆయన పదవీలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. జమాతే ఇస్లామీ వంటి మతోన్మాద శక్తులకు యూనస్ అండగా నిలిచారు. ఇదే కాకుండా, ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి వ్యతిరేకంగా మతన్మాద, పాక్ అనుకూల ఫైజర్ రెహమాన్ అనే జనరల్ సైన్యంలో తిరుగుబాటు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్మీ చీఫ్ వకార్, తన శక్తిని నిరూపించుకుంటున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పాటు పలు నగరాల్లో ఆయనకు అనుకూలంగా ఉన్న ఆర్మీ కంటోన్మెంట్లకు చెందిన సైన్యాన్ని మోహరించారు. ఈ నేపథ్యంలో యూనస్‌పై తిరుగుబాటు తప్పదా..? అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాన్ని గద్దె దించి బంగ్లా ఆర్మీ అధికారాన్ని చేపట్టే అవకాశం కనిపిస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ.. సైన్యం సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. రాబోయే రోజుల్లో బంగ్లాలో భారీ మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Hyderabad: బెట్టింగ్‌కి యువకుడు బలి.. తన కొడుకును టార్చర్ చేశారన్న తల్లిదండ్రులు..
ఈ సమావేశంలో ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్ (GOCలు), ఇండిపెండెంట్ బ్రిగేడ్‌ల కమాండింగ్ అధికారులు, ఆర్మీ ప్రధాన కార్యాలయం నుండి అధికారులు సహా అగ్రశ్రేణి ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. యూనస్ ప్రభుత్వంపై బంగ్లా వ్యాప్తంగా అపనమ్మకం పెరుగుతోంది. అత్యవసర పరిస్థితి విధించడం లేదా యూనస్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగే అవకాశం కనిపిస్తోంది. సైన్యం తన పర్యవేక్షణలో జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది.
ఇటీవల తాత్కాలిక ప్రభుత్వంలోని ఇతర నేతలు, విద్యార్థి నాయకులు సైన్యానికి వ్యతిరేకంగా గొంతులు వినిపించారు. ఇది సైన్యంలోని అనేక వర్గాలను కలవరపెట్టింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీ, హిజ్బుత్ తెహ్రీర్ వంటి మతఛాందసవాద సంస్థలు కూడా సైన్యంపై అజమాయిషీ చెలాయించాలని చూశాయి. ఇదిలా ఉంటే, కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య యూనస్ త్వరలో చైనాని సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఢాకాలో ఉమ్మడి భద్రతా దళాల గస్తీని ముమ్మరం చేసింది. చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసింది. ఇటీవల, ఫ్రాన్స్‌కి చెందిన ప్రో ఇస్లామిక్ బంగ్లాదేశ్ ఇన్‌ఫ్లూయెన్సర్ పినాకి భట్టాచార్య ఉగ్రవాదులు, విద్యార్థులు సైన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని కోరిన తర్వాత సైన్యం విస్తృత భద్రత ఏర్పాటు చేసింది. ఆర్మీ చీఫ్‌పై భారత్ ప్రభావం ఉందని అతను ఆరోపించాడు. హసీనా నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారత్, బంగ్లా ఆర్మీతో కలిసి ప్లాన్ చేస్తోందని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు.