Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా, తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్‌పై విరుచుకుపడ్డారు. ఆయన బంగ్లాదేశ్‌ని అమెరికాకు అమ్మేస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని సైన్యం పిలుపునిచ్చిన తర్వాత, తాను రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మహ్మద్ యూనస్ తీవ్రవాద గ్రూపుల మద్దతుతో పరిపాలన చేస్తున్నారని షేక్ హసీనా ఆరోపించారు. ఇటీవల తన పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం విధించడాన్ని ఆమె ఖండించారు. దీనిని రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ గుర్తు చేసుకుంటూ.. సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని అమెరికాకు ఇవ్వడానికి నిరాకరించినందుకు ఆయన హత్యకు గురయ్యారని చెప్పారు. “అమెరికా సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని కోరుకున్నప్పుడు, నా తండ్రి అంగీకరించలేదు. ఆయన తన ప్రాణాలను అర్పించాల్సి వచ్చింది. నాకు అలాంటి విధి వచ్చింది. ఎందుకంటే అధికారంలో ఉండటానికి దేశాన్ని అమ్మేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు” అని ఆమె ఫేస్‌బుక్ పోస్టులో చెప్పింది.
Read Also: PakIstan: భారత్ టార్గెట్‌గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
‘‘ఈ దేశ ప్రజలు జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ పిలుపునకు స్పందించి, ఆయుధాలు చేపట్టి పోరాడి, మూడు మిలియన్ల మందిని విడిపించడానికి తమ ప్రాణాలను అర్పించిన దేశం ఇది. ఆ దేశ నేలలో ఒక్క అంగుళం కూడా ఎవరికీ వదులుకోవాలనే ఉద్దేశ్యం ఎవరికీ ఉండదు. కానీ ఈ రోజు ఎంత దురదృష్టం. అలాంటి వ్యక్తి(యూనస్) అధికారంలోకి వచ్చాడు, మొత్తం దేశ ప్రజలచే పూర్తిగా ప్రేమించబడే వ్యక్తి, ప్రపంచం ప్రేమించబడే వ్యక్తి అయిన ముజిబుర్ రెహమాన్‌కి యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది.?’’ అని ఆమె ప్రశ్నించారు. తీవ్రవాద గ్రూపుల సహాయంతో యూనస్ ప్రభుత్వ నియంత్రణ చేజిక్కించుకున్నారని హసీనా ఆరోపించారు.
యూనస్ ఉగ్రవాదుల సాయంతో, అంతర్జాతీయ నిషేధించిన వారితో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆమె దుయ్యబట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఉగ్రవాద రాజ్యాంగా ఉందని అన్నారు. ఈ తీవ్రవాద నాయకుడికి గొప్ప బెంగాలీ దేశం యొక్క రాజ్యాంగాన్ని తాకే హక్కు లేదని, అతడిని ప్రజలు ఎన్నుకోలేదు, కాబట్టి అతను చట్టాలను ఎలా మార్చగలడు..? అవామీ లీగ్‌ని ఎలా నిషేధించగలడు అని హసీనా ప్రశ్నించారు.
