NTV Telugu Site icon

The Sun: సూర్యుడి ఉపరితలంపై భారీ రంధ్రం.. భూమికి ప్రమాదమా..?

Sun Hole

Sun Hole

Massive ‘Hole’ Spotted on Sun’s Surface: సౌరకుటుంబానికి మూలం సూర్యుడు. ఈ గ్రహాలను తన గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ తిప్పించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే సూర్యుడిపై భారీగా ఏర్పడిన నల్లటి ప్రాంతాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమి కన్నా 20 రెట్లు పెద్దగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాంటి భారీ బ్లాక్ స్పాట్లను ‘‘కరోనల్ హోల్’’గా పిలుస్తారు. భారీ సూర్యుడి వెలుగుల మధ్య నల్లటి ప్రాంతం ఓ రంధ్రంగా కనిపిస్తుంటుందని అందుకనే వీటిని కరోనాల్ హోల్ గా వ్యవహరిస్తుంటారు. సూర్యుని దక్షిణ ధ్రువానికి సమీపంలో మార్చి 23న నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO) కరోనల్ హోల్‌ను కనుగొంది.

ఇలాంటి బ్లాక్ స్పాట్ల నుంచి అయస్కాంత తుఫానులు భూమి వైపు దూసుకు వస్తుంటాయి. ఈ బ్లాక్ స్పాట్ల నుంచి సౌర తుఫానులు దూసుకు వస్తుంటాయి. ప్రస్తుతం ఏర్పడిన కరోనల్ హోల్ చాలా పెద్దది. దాదాపు 300,000 నుండి 400,000 కిలోమీటర్ల వరకు ఉంది. అంటే దాదాపు 20-30 భూమిలతో సమానం. జియోమ్యాగ్నటిక్ తుఫానులను జీ1 నుంచి జీ5 వరకు వర్గీకరించారు. ఇందులో జీ5 అత్యంత శక్తివంతమైనది.

ఈ బ్లాక్ స్పాట్స్ ఎలా ఏర్పడుతాయి..?

ఆల్ట్రావయోలెట్, ఎక్స్ కిరణాలు కలిగి భగభగ మండే సూర్యుడి ఉపరితలంపై బ్లాక్ గా ఉండే ప్రాంతాలను కరోనల్ హెల్స్ అంటారు. చుట్టుపక్కల ఉండే ప్లాస్మా కన్నా ఇది చల్లగా, తక్కువ సాంద్రత కలిగిన ప్రాంతాలు. ఈ కరోనాల్ హోల్స్ సూర్యుడిపై ఎప్పుడైనా, ఎక్కడైనా ఏర్పడవచ్చు. అయితే సూర్యుడి ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద చాలా తీవ్రతతో స్థిరంగా ఉంటాయి.

భూమిపై ఎలా ప్రభావం చూపిస్తాయి..?

ఈ కరోనల్ హోల్స్ నుంచి ఆవేశిత కణాలు అయస్కాంత తుఫాన్ల రూపంలో భూమి వైపు దూసుకొస్తుంటాయి. తాజాగా ఏర్పడిన రంధ్ర వద్ద నుంచి వచ్చే తుఫానులు శుక్రవారం భూమిని తాకనున్నాయి. గంటలకు 2.9 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తున్నాయి. ఈ అయస్కాంత తుఫానులు భూమిపై పెద్దగా ప్రభావం చూపించవు కానీ భూమి చుట్టు తిరుగుతున్న కమ్యూనికేషన్ శాటిలైట్లను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. జీపీఎస్, మొబైల్ ఫోన్లపై ప్రభావం చూపిస్తుంది. భూమికి సహజంగా ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రం, సూర్యుడి నుంచి వచ్చే అయస్కాంత తుఫానులను అడ్డుకుంటుంది.