Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్‌ని భయపెడుతున్న భారీ వర్షాలు.. 41 మంది మృతి..

Pakistan Rains

Pakistan Rains

Pakistan: పాకిస్తాన్‌ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. గత మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 41 మంది మరణించారు. దేశ నైరుతి ప్రాంతంలో పాక్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రైతులే ఉన్నారని అధికారులు సోమవారం వెల్లడించారు. తూర్పు పంజాబ్ ప్రావిన్సులో గోధుమ పండిస్తున్న రైతులపై పిడుగులు పడటంతో పాటు వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోవడంతో చాలా మంది మరణించారు. కేవలం పిడుగుల కారణంగానే 28 మంది ప్రాణాలు కోల్పోయారు. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాక్ ప్రభుత్వం సూచించింది. కొండచరియలు విరిగి పడటంతో పాటు ఆకస్మిక వరదల హెచ్చరిలకు జారీ చేసింది.

Read Also: SRH vs RCB: భారీ స్కోరు చేసిన సన్ రైజర్స్.. ఆర్సీబీ బౌలర్లపై ఊచకోత

పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ పంజాబ్‌లో శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో పిడుగుపాటు కారణంగా 21 మరణాలు సంభవించాయి. ప్రావిన్సులతో సమన్వయం చేసుకోవాలని పాక్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీని ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం ఆదేశించారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పిడుగుపాటు వల్ల 8 మంది మరణించారు. దాదాపుగా 25 జిల్లాలు వరదలకు ప్రభావితమయ్యాయి. దక్షిణ సింధ్ ప్రావిన్సులో వరదల కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి నలుగురు మరణించారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోవడంతో నలుగురు పిల్లలతో సహా 8 మంది మరణించారు.

Exit mobile version