Lashkar-e-Taiba: భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడులు పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థల వెన్నుల్లో వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో నిర్వహించిన క్షిపణి దాడులతో చావుదెబ్బ తిన్న లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థ.. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయ సరిహద్దుల్లో మళ్లీ పంజా విసరడానికి కుట్రలు చేస్తోంది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా (KPK) ప్రావిన్స్ పరిధిలోని అబోటాబాద్‌లో సరికొత్త ‘మర్కజ్’ (ఉగ్రవాద కేంద్రం)ను రెడీ చేస్తున్నట్లు భారత నిఘా వర్గాల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత లష్కర్ పునరుద్ధరించిన ఐదవ ప్రధాన ఉగ్రవాద స్థావరం ఇదేనని భద్రతా సంస్థలు పేర్కొంటున్నాయి.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ‘మక్కీ’ పేరుతో కొత్త స్థావరం
నిఘా వర్గాల నుంచి అందిన లీకుల ప్రకారం.. లష్కర్ అధిపతి హఫీజ్ సయీద్ బావమరిది, ఆ సంస్థ సీనియర్ నాయకుడైన అబ్దుల్ రెహమాన్ మక్కీ పేరు మీద ఈ కొత్త మర్కజ్‌ను ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ బహవల్పూర్‌లో జన్మించిన మక్కీని ఇప్పటికే అమెరికా, భారత్ ‘గ్లోబల్ టెర్రరిస్ట్’గా ప్రకటించాయి. లష్కర్-ఎ-తైబా (జమాత్-ఉద్-దావా – JuD)కు డిప్యూటీ అమీర్‌గా, రాజకీయ – విదేశీ వ్యవహారాల విభాగాధిపతిగా వ్యవహరించిన మక్కీ.. లష్కర్ ఉగ్ర నెట్‌వర్క్‌ను అంతర్జాతీయంగా విస్తరించిన ముఖ్య వ్యూహకర్తలలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు అతని పేరుతోనే ఈ సరికొత్త ఆపరేషన్ కేంద్రం రెడీ అవుతుందని సమాచారం.
ఆపరేషన్ సింధూర్ తర్వాత
2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు 2025 మే 7న పాకిస్థాన్, పీఓకే (PoK) లోని ఉగ్ర స్థావరాలపై కచ్చితమైన క్షిపణి దాడులతో ‘ఆపరేషన్ సింధూర్’ను స్టార్ట్ చేశాయి. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైష్-ఎ-మహ్మద్‌లకు చెందిన 9 ప్రధాన శిక్షణా కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ మురిద్కేలో ఉన్న లష్కర్ ప్రధాన కార్యాలయం పూర్తిగా నాశనమైంది. దీంతో ఉగ్రవాదులు తమ కార్యకలాపాల దృష్టిని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా (KPK), ఆఫ్ఘన్ సరిహద్దు వైపు మళ్లించి, వరుసగా కొత్త స్థావరాలను నిర్మిస్తూ వస్తున్నారని చెబుతున్నారు. 2025 సెప్టెంబర్ 26, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా (KPK) లో కొత్త స్థావరం విస్తరణ ప్రారంభం అయ్యింది, 2026 ఫిబ్రవరి 16న కోట్లి ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలు పెరిగాయి. ఇదే సంవత్సరం మార్చి 12న మీర్‌పూర్‌లో కొత్త నిర్మాణం బాహ్య ప్రపంచానికి తెలిసింది. మార్చి 13న రావల్కోట్‌లో ఉగ్ర నెట్‌వర్క్ విస్తరణ జరిగింది. తాజాగా అబోటాబాద్‌లో ఐదో ప్రధాన కేంద్రం స్థాపించారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
అనాథ పిల్లలే లక్ష్యం..
అబోటాబాద్‌లో నిర్మిస్తున్న ఈ కొత్త కాంప్లెక్స్ వెనుక అత్యంత ప్రమాదకరమైన కుట్ర దాగి ఉందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. సామాజికంగా, కుటుంబపరంగా ఎలాంటి రక్షణ లేని అనాథ పిల్లలను, అమాయక యువకులను టార్గెట్ చేసి ఈ కేంద్రంలోకి చేర్చుకుంటున్నారని సమాచారం. వారి మైండ్‌ను పూర్తిగా బ్లాక్ చేసి, తీవ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నట్లు అనుమానిస్తున్నారు. భవిష్యత్తులో వీరిని ఆత్మాహుతి దాడులకు వాడుకుంటే, వారి వివరాలు దొరకడం, ఉగ్ర సంస్థలను జవాబుదారీ చేయడం కష్టమవుతుందనే వ్యూహంతోనే లష్కర్ ఈ దారుణానికి ఒడిగడుతోందని చెబుతున్నారు.
అలర్ట్ అయిన భారత్
మురిద్కే హెడ్‌క్వార్టర్స్ ధ్వంసమైన విషయాన్ని లష్కర్ టాప్ కమాండర్లు బహిరంగంగానే అంగీకరించారు. అయితే ఆపరేషన్ సింధూర్ అనంతరం ఉగ్రవాదులు తమ మౌలిక సదుపాయాలను కొత్త ప్రాంతాలకు మారుస్తూ, సరిహద్దుల్లో రీ – గ్రూప్ అవుతున్న తాజా పరిణామాలను భారత నిఘా – భద్రతా సంస్థలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికే సరిహద్దు వెంబడి నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి.
