Bangladesh: గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ ఉద్యోగ కోటాలో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రధాని షేక్ హసీనా దిగిపోవాలని ఉద్యమించారు. అయితే, ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. చివరకు ఈ అల్లర్లు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే, గత సంవత్సరం జరిగిన సామూహిక నిరసనల సందర్భంగా విద్యార్థులపై కాల్పులు జరపాలని షేక్ హసీనా భద్రతా బలగాలను ఆదేశించారని బీబీసీ ధ్రువీకరిస్తూ లీక్ అయిన ఫోన్ కాల్ గురించి నివేదించింది. ఆందోళనకారులపై కనిపిస్తే కాల్చివేయాలని చెబుతున్నట్లు ఆడియో లీక్‌లో ఉంది. జూలై 18, 2024న ఢాకాలోని తన అధికారిక నివాసం నుండి చేసిన ఫోన్ కాల్‌లో ‘‘నేను వారందరినీ ఈ రాత్రి అరెస్టు చేయాలని ఆదేశించాను. అందరికీ సమాచారం అందింది, మీరు వారిని ఎక్కడ కనుగొంటే, వారిని పట్టుకోండి. నేను బహిరంగ ఉత్తర్వు జారీ చేసాను. ఇప్పుడు, వారు ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగిస్తారు. వారు కనిపిస్తే కాల్చివేయండి’’ అని ఫోన్ కాల్‌లో షేక్ హసీనా చెప్పారు.
సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పోరాడిన కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడంపై గతేడాది పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. చివరకు ఈ అల్లర్లు షేక్ హసీనా పదవి పోవడానికి కారణమైంది. ఈ అల్లర్ల అణచివేతలో 1400 మంది వరకు మరణించినట్లు చెబుతున్నారు. 1971 యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌లో దారుణమైన హింస ఇదే.
మానవత్వానికి విరుద్ధంగా జరిగిన నేరాలకు సంబంధించి షేక్ హసీనాపై బంగ్లాదేశ్ లో కేసులు ఫైల్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ ఆడియో లీక్‌ని ఉపయోగించుకోవాలని బంగ్లా ప్రాసిక్యూటర్లు ఆలోచిస్తున్నారు. ఆగస్టు 5న ఢాకాలోని జత్రాబారి పరిసరాల్లో అత్యంత దారుణమైన మారణహోమం జరిగింది, అక్కడ సైన్యం ఆ ప్రాంతం నుండి వైదొలిగిన తర్వాత పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కొత్తగా బయటపడిన ఆధారాల ప్రకారం, కనీసం 52 మంది మరణించారు. ఇది మునుపటి నివేదిక కన్నా ఎక్కువ. హసీనాతో పాటు, మాజీ పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులతో సహా 203 మందిపై అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) నేరారోపణలు చేసింది, 73 మంది కస్టడీలో ఉన్నారు.
