100 children killed in suicide bombing at Kabul school: ఆప్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. రాజధాని కాబూల్ లోని ఓ స్కూల్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 100కు చేరినట్లు తెలుస్తోంది. కాబూల్ నగరానికి పశ్చిమాన ఉన్న దష్ట్-ఏ- బర్చి ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దాడి సమయంలో మొత్తం స్కూల్ లో దాదాపుగా 600 మంది విద్యార్థులు ఉన్నారు. యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు సిద్ధం అవుతున్న సయమంలో ఈ దాడి జరిగింది.
మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన విద్యార్థుల్లో హజారా, షియా మైనారిటీకి చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. చనిపోయిన వారిలో ఎక్కువగా బాలికలే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అనేక ఉగ్రదాడులు జరిగాయి. ముఖ్యంగా మైనారిటీలే లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్ కేపీ) ఉగ్రవాద సంస్థ వరసగా దాడులకు పాల్పడుతోంది. గతంలో ఓ షియాలు లక్ష్యంగా మసీదులు, స్కూళ్లపై దాడులు చేసింది.
Read Also: Russia-Ukraine war: రష్యా దాడిలో 23 మంది సాధారణ పౌరులు మృతి
ఆఫ్ఘనిస్తాన్ లో మైనారిటీలుగా ఉన్న షియాలు, హజారాలు, సిక్కులు దశాబ్ధాలుగా హింసను ఎదుర్కొంటున్నారు. 1996-2001 వరకు ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు పాలించిన సమయంలో కూడా వీరు తీవ్ర అణచివేతను ఎదుర్కొన్నారు. 2021 ఆగస్టులో మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబన్లు మైనారిటీలను కూడా తమ దేశస్తులుగానే భావిస్తున్నప్పటికీ.. ఐఎస్ ఉగ్రవాదులు మాత్రం వరసగా మైనారిటీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికల విద్యను నిషేధిస్తున్నారు. దీంతో పాటు మహిళలు ఉద్యోగాలు చేయకుండా ఆంక్షలు విధించారు. బయటకు వెళ్తే బురఖా ధరించడంతో పాటు మగవారిని వెంట తీసుకుని వెళ్లేలా ఆదేశాలు జారీ చేశారు. మహిళల స్వేచ్ఛపై తీవ్ర ఆంక్షలు విధించడంతో తాలిబన్ ప్రభుత్వాన్ని మెజారిటీ ప్రపంచదేశాలు గుర్తించలేదు. దీంతో ఆప్ఘన్ వ్యాప్తంగా పేదరికంతో ప్రజలు అల్లాడుతున్నారు. చివరకు పేదరికం కారణంగా తమ పిల్లలను, కిడ్నీలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.