Site icon NTV Telugu

Putin: పుతిన్‌ సమక్షంలోనే స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్.. వీడియో వైరల్

Putin

Putin

సెలబ్రిటీలు వెరైటీగా స్నేహితులకు ప్రపోజ్ చేయడం చూస్తుంటాం. క్రీడాకారులైతే స్టేడియంలో.. సినీ నటులైతే వేదికలపై తమ మనసులోని అభిప్రాయాన్ని చెబుతుంటారు. ఇలాంటి వీడియోలు ఎన్నో వచ్చాయి. తాజాగా రష్యాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక జర్నలిస్ట్.. పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉండగా స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మారథాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాది చివరిలో పుతిన్ ఎప్పుడూ విలేకర్ల సమావేశం పెడుతుంటారు. మీడియా సమావేశం లైవ్‌ జరుగుతుండగా ఓ యువ జర్నలిస్ట్ కిరిల్ బజనోవ్( 23) లేచి తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు. ఎర్రటి బో టై ధరించి.. ‘‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.’’ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకున్నాడు. దీంతో హాల్‌లో జరుగుతున్న విలేకర్ల సమావేశం కాస్త శృంగారభరితంగా మారిపోయింది.

ఈ అరుదైన దృశ్యం పుతిన్ కంటపడింది. ఈ సందర్భంగా బజానోవ్.. ప్రియురాలి పెళ్లి ప్రతిపాదన చేశాడు. ‘నా స్నేహితురాలు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తోందని నాకు తెలుసు. ఒలెచ్కా నన్ను పెళ్లి చేసుకో.’’ అంటూ ప్రపోజ్ చేశాడు. వెంటనే విలేకర్ల నుంచి నవ్వులు, హర్షధ్వానాలు, చప్పట్లు మార్మోగాయి.

ఈ సందర్భంగా పుతిన్ కూడా చప్పట్లు కొట్టడంతో మరోసారి చప్పట్లతో హాలు దద్దరిల్లింది. ప్రతిస్పందనతో ఉత్సాహంగా ఉన్న బజనోవ్.. రష్యా అధ్యక్షుడిని నేరుగా ఉద్దేశించి.. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్.. మా వివాహ వేడుకలో మిమ్మల్ని చూడటానికి మేము చాలా సంతోషిస్తాము.’’ అని అన్నాడు. పుతిన్ మాత్రం ఆహ్వానాన్ని తిరస్కరించారు కానీ ఒక తేలికైన వ్యాఖ్యతో అనుగుణంగా వ్యవహరించారు.

దాదాపు గంట పాటు మీడియా సమావేశానికి అంతరాయం కలిగింది. అనంతరం మీడియా సమావేశం యథావిథిగా కొనసాగింది. మొత్తానికి బజనోవ్ స్నేహితురాలు పెళ్లి ప్రతిపాదనను అంగీకరించినట్లుగా కథనాలు పేర్కొన్నాయి.

 

Exit mobile version