NTV Telugu Site icon

Trump: గాజాను స్వాధీనం చేసుకుంటాం.. జోర్డాన్ రాజుతో ట్రంప్ వ్యాఖ్య

Trump2

Trump2

గాజాను స్వాధీనం చేసుకుని తీరుతామని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై జోర్దాన్‌ రాజు అబ్దుల్లాతో ట్రంప్ చర్చించారు. గాజాను కొనాల్సిన అవసరం లేదని.. దానిని స్వాధీనం చేసుకుని తీరుతామని ట్రంప్ వెల్లడించారు. గాజాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచన లేదని.. గాజాను రక్షించి పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. పశ్చిమాసియాలోని ప్రజలకు అనేక ఉద్యోగలు సృష్టించనున్నామని స్పష్టం చేశారు.

ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో గాజాలో అనారోగ్యంతో బాధపడుతున్న 2 వేల మంది చిన్నారులను తమ దేశానికి తీసుకెళ్తామని అబ్దుల్లా తెలిపారు. ఈ సందర్భంగా అద్భుతమైన విషయం అంటూ ట్రంప్ ప్రశంసించారు. అయితే పాలస్తీనియన్లను చేర్చుకునే ప్రతిపాదనను మాత్రం జోర్డాన్ రాజు తోసిపుచ్చారు. వారిని అక్కడే ఉంచి గాజాను పునర్ నిర్మించాలని అబ్దుల్లా పేర్కొన్నారు. ట్రంప్ ప్రతిపాదనపై అరబ్ దేశాలు రియాద్‌లో చర్చిస్తాయని స్పష్టం చేశారు. ఇక ట్రంప్ ప్రకటనను హమాస్ తప్పుపట్టింది. గాజాను కొనుగోలు చేసి అమ్మడానికి అది స్థిరాస్తి కాదని.. పాలస్తీనాలో అది విడదీయలేని భాగం అని తెలిపింది.

పాలస్తీనియన్లకు జోర్డాన్, ఈజిప్ట్‌ దేశాలు ఆశ్రయం కల్పించాలని.. లేదంటే సాయం నిలిపివేస్తానని ట్రంప్ హెచ్చించారు. పాలస్తీనియన్లను ఖాళీ చేసిన తర్వాతే గాజాను స్వాధీనం చేసుకుంటామని.. అప్పుడు మాత్రమే గాజా పునర్ నిర్మాణం సాధ్యమవుతుందని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు.