Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్‌ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..

  • ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్‌లను నిషేధించే యోచన..
  • ప్రతిపాదనను త్వరలో కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్న మెలోని..
  • ప్రతి తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు చట్టపరమైన పరిమితి ప్రతిపాదన
Italy

Italy

Italy: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇటలీ పాఠశాలల్లో ‘‘బురఖా, నిఖాబ్’’లను నిషేధించే ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ఆదివారం మెలోనీ ప్రకటించారు. ఈ ప్రతిపాదనల్ని త్వరలో క్యాబినెట్‌కు సమర్పించబోతున్నట్లు చెప్పారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి ధరించాలనే నియమాన్ని, సంప్రదాయం పేరుతో ముఖాన్ని కప్పుకోవడాన్ని అనుమతించమని ఆమె అన్నారు.

ఇది కేవలం హిజాబ్, నిఖాబ్‌కు మాత్రమే పరిమితం కాదని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతీ క్లాసులో విదేశీ పిల్లల సంఖ్యను కూడా పరిమితంచేయాలని యోచిస్తోంది. పిల్లలు స్థానిక వాతావరణంలో, భాషలో మరింత సులభంగా కలిసిపోయేలా చూడటమే ఈ నిర్ణయం లక్ష్యమని ఇటలీ చెబుతోంది. ఇటాలియన్‌ను నేర్చుకోవడాన్ని కూడా తప్పనిసరి చేయాలని మెలోనీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఈ నిర్ణయాలను ఇంకా చట్టబద్ధంగా రూపొందించలేదు. కేబినెట్ ఆమోదం తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది.

విదేశీ విద్యార్థులపై పరిమితి ఎందుకు.?

ఇటలీ భాషను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడే విద్యార్థి తరగతి గదిలో ఒక్కరే ఉంటే, వారు తోటి విద్యార్థులు, టీచర్ల సహాయంతో త్వరగా నేర్చుకోవడం వీలవుతుందని ప్రధాని మెలోని చెబుతున్నారు. పిల్లల సంఖ్య పెరిగినా, తరగతి గదిలో వారి మెజారిటీ ఎక్కువగా ఉన్నా ఇటలీ కల్చర్, భాషను నేర్చుకోవడం కష్టంగా మారొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించాలని అనుకుంటున్నారు.