NTV Telugu Site icon

Israel: న్యాయ సంస్కరణలకు ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఆమోదం

Israel

Israel

Israel: న్యాయ సంస్కరణలకు ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఇజ్రాయెల్‌లో ఎన్ని ఆందోళనలు ఎదురైనా నెతన్యాహు ప్రభుత్వం తెచ్చిన న్యాయ సంస్కరణలకు పార్లమెంట్‌ ప్రాథమికంగా ఆమోదముద్ర వేసింది. దీంతో తొలి దశలో నెతన్యాహు వర్గం విజయం సాధించినట్టయింది. దేశ సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రాథమికంగా పార్లమెంట్‌ ఆమోదముద్ర వేసింది. ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు చేపట్టిన న్యాయ సంస్కరణల్లో భాగంగా ఈ బిల్లు పార్లమెంటు వద్దకు వచ్చింది. ఈ బిల్లు ప్రతిపక్షాల్లో, దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు కారణమైన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా అమెరికా వంటి దేశాలు కూడా దీనిని తప్పుపట్టాయి.

Read also: Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థ లేనపుడు దేశం ఆగిపోలేదు.. జనసేనాని కామెంట్స్

124 మంది సభ్యులున్న పార్లమెంటులో 64 మంది న్యాయ సంస్కరణలకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్‌, మంత్రులు, ఇతర ఎన్నికైన సభ్యుల నిర్ణయాలు అహేతుకంగా ఉన్నాయనే పేరిట ఇక నుంచి సుప్రీం కోర్టు కొట్టేయడానికి అవకాశం లేదు. ఇక ఈ బిల్లు చర్చకోసం కమిటీ వద్దకు రానుంది. అక్కడ చర్చల అనంతరం మార్పులు చేర్పులు చోటు చేసుకొని.. తిరిగి తుది ఓటింగ్‌కో పార్లమెంటుకు వెళుతుంది. దీనిపై ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యానికి ముగింపు కాదని.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను సంస్కరిస్తామనే హామీతో తమ కూటిమి అధికారంలోకి వచ్చిందని నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. వామపక్ష భావజాలం గల జడ్జీలతో న్యాయవ్యవస్థ నిండిపోయిందన్నది వారి ఆరోపణ. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలను తిరస్కరించే హక్కు.. ప్రజలు ఎన్నుకోని న్యాయమూర్తులకు ఉండదని నెతన్యాహు వర్గం వాదిస్తోంది. సుప్రీంకోర్టుతోపాటు దేశంలోని ఇతర కోర్టులకు జడ్జీలను నియమించే అధికారం ప్రభుత్వానికే ఉండాలంటున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాధినేతలూ ఇజ్రాయెల్‌ న్యాయవ్యవస్థ ప్రక్షాళనపై ఆందోళన వ్యక్తం చేశారు. మీరు వెళుతున్న దారి సరైనది కాదంటూ గతంలో నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే.

Show comments