NTV Telugu Site icon

Israel: ఇజ్రాయిల్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్న హిజ్బుల్లా.. భారీ మూల్యం చెల్లించుకుంటారు..

Hezbollah Vs Israel

Hezbollah Vs Israel

Israel: ఇజ్రాయిల్-హమాస్ పోరు గత రెండు వారాలుగా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7న హమాస్ మారణకాండ వల్ల ఇజ్రాయిల్ లో 1400 మంది మరణించారు. హమాస్ అత్యంత క్రూరంగా పిల్లలు, మహిళలు, వృద్ధులని చూడకుండా ఊచకోత కోసింది. ఈ ఘటన తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్ ప్రాంతంపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో గాజాలో 4000 మంది మరణించారు.

ఇదిలా ఉంటే హమాస్ కి మద్దతుగా ఉత్తరాన లెబనాన్ నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంలోని సైనికుల స్థావరాలపై దాడులు చేశారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గాల్లంట్ శనివారం మాట్లాడుతూ.. లెబనాన్ సాయుధ గ్రూప్ హిజ్బుల్లా ఇజ్రాయిల్ పై దాడులు చేయాలని నిర్ణయించుకుందని, అయితే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ఆయన హెచ్చరించారు.

Read Also: Panipuri: పానీపూరి తిని 40 మంది పిల్లలకు అస్వస్థత

ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ఇజ్రాయిల్ పై దాదాపుగా ప్రతీరోజూ దాడులు చేస్తోంది. 2006లో హిజ్బుల్లా-ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరిగింది. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రికత్త కొనసాగుతోంది. అక్టోబర్ 15న ఇజ్రాయిల్ రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ కు ఉత్తర ప్రాంతంలో యుద్ధం చేయడంలో ఆసక్తి లేదని, హిజ్బుల్లా నిగ్రహంగా ఉంటే, సరిహద్దుల్లో పరిస్థితి అలాగే ఉంటుందని ఆయన చెప్పారు.

ఇటు హమాస్, అటు హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు ఉంది, అయితే ఈ యుద్ధంలో ఇరాన్ కలుగజేసుకుంటే బాగుండదని ఇప్పటికే అమెరికా వార్నింగ్ ఇచ్చింది. సంక్షోభాన్ని నిరోధించేందుకు ఇప్పటికే రెండు విమానవాహక నౌకలను అమెరికా మధ్యధరా సముద్రంలో మోహరించింది. ఇటీవల హిజ్బుల్లా కీలక నేత హషేమ్ సఫీద్దీన్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, యూరోపియన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.