NTV Telugu Site icon

Israel-Hamas War: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు.. భూతల దాడికి అంతా సిద్ధం..

Israel

Israel

Israel-Hamas War: అక్టోబర్ 7 హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై క్రూరమైన దాడిని చేశారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. 200 మందికి పైగా సాధారణ ప్రజలను బందీలుగా పట్టుకుని గాజాకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇజ్రాయిల్, గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 6500 మంది మరణించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వైమానిక దాడులకు పరిమితమైన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమవుతున్నాయి. గాజా ఆక్రమణ కోసం ఐడీఎఫ్ బలగాలు ఎదురుచూస్తున్నాయి.

Read Also: Maharashtra : మహారాష్ట్రలో దారుణం.. అన్నం పెట్టలేదని తల్లిని చంపిన కొడుకు

ఈనేపథ్యంలోనే హమాస్ నియంత్రణలో ఉన్న గాజాలోకి ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులతో ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్యాంకులు, పదాతి దళం రాత్రిపూట దాడి చేశాయని ఇజ్రాయిల్ తెలిపింది. ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూ భూతల దాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాలస్తీనా భూభాగమైన గాజాలోకి ఇజ్రాయిల్ బలగాలు చొచ్చుకెళ్లాయి.ఈ ఆపరేషన్‌ని ‘‘టార్గెటెడ్ రైడ్స్’’గా ఇజ్రాయిల్ అభివర్ణించింది. ఉగ్రవాద మౌళిక సదుపాయాలు, యాంటీ ట్యాంక్ క్షిపణి పోస్టులపై దాడులు చేసినట్లు తెలిపింది. ఇది పోరాటం యొక్క తదుపరి దశలకు సన్నాహాలని పేర్కొంది. ట్యాంకులతో గాజాలోకి వెళ్లిన ఇజ్రాయిల్ బలగాలు మళ్లీ ఇజ్రాయిల్ భూభాగానికి తిరిగి వచ్చారు.

ఐడీఎఫ్ పోస్టు చేసిన వీడియోలో సరిహద్దు కంచెను దాటుతున్న వాహనాలు, బుల్డోజర్లను చూపించింది. ముఖ్యంగా ఉత్తర గాజాను ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. ఇప్పటికే ఇజ్రాయిల్, గాజాలోని ఉత్తర ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. ఒక మిలియన్ జనాభా ఉన్న ఉత్తర గాజా నుంచి ఇప్పటికే చాలా మంది దక్షిణ గాజాకు వెళ్లారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయిల్ కు చెప్పడంతోనే ఇన్ని రోజులుగా గాజాపై ఆక్రమనను ఇజ్రాయిల్ ఆలస్యం చేస్తూ వస్తోంది. హమాస్‌ని పూర్తిగా నిర్వీర్యం చేస్తామని ప్రకటించిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ప్రస్తుతం ఎవరి మాట వినే స్థితిలో లేరు. హమాస్ అంతాన్ని ఆయన కోరుకుంటున్నారు. మరోవైపు అరబ్ ప్రపంచం, ముస్లిం దేశాలు కాల్పుల విరమణ పాటించాలని, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరుతోంది.