NTV Telugu Site icon

Israel: ఇజ్రాయిల్‌పై విరుచుకుపడిన హిజ్బుల్లా.. రాకెట్లతో దాడి..

Israel

Israel

Israel: లెబనాన్ మిలిటెంట్ సంస్థ, ఇరాన్ ప్రాక్సీగా చెప్పబడుతున్న హిజ్బుల్లా మరోసారి ఇజ్రాయిల్‌పై రాకెట్లతో విరుచుకుపడింది. శనివారం ఉదయం ఇజ్రాయిల్ నగరమైన సఫేద్, దాని పరిసర ప్రాంతాలపై 55 రాకెట్లను ప్రయోగించిందని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. లెబనాన్ నుంచి రెండు దఫాలుగా దాడి జరిగిందని, మొదటిసారి సుమారు 20 రాకెట్లు, రెండోసారి 35 రాకెట్లు ప్రయోగించబడినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది.

ఇజ్రాయిల్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా వరకు రాకెట్లను మధ్యలోనే అడ్డగించి ధ్వంసం చేశాయని, కొన్ని బహిరంగ ప్రదేశాల్లో పడినట్లు ఇజ్రాయిల్ చెప్పింది. ఈ దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా రాకెట్ లాంచింగ్‌లను టార్గెట్ చేసుకుని దాడులు చేసిన కొద్ది సేపటికే, వారు రాకెట్ దాడికి పాల్పడినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.

Read Also: Mamata Banerjee: ‘‘రాత్రులు నిద్ర పోలేదు’’.. నిరసన తెలుపుతున్న వైద్యుల వద్దకే సీఎం మమతా బెనర్జీ..

ఇదిలా ఉంటే, ఇటీవల ఆరుగురు ఇజ్రాయిల్ బందీలను హత్య చేసిన దక్షిణ గాజాలోని సొరంగాలు ఉన్న ప్రాంతానికి ఇజ్రాయిల్ మిలిటరీ శుక్రవారం మీడియాను తీసుకెల్లింది. సెప్టెంబర్ 01న హమాస్ ఆరుగురు బందీలను చంపింది. అయితే, భద్రతా కారణాల వల్ల రఫాలోని టెల్ అల్ సుల్తాన్ ప్రాంతంలోని సొరంగాల్లోకి విలేకరులను అనుమతించలేదు. భూమికి 20 మీటర్ల దిగువన ఉన్న సొరంగాల ఫుటేజీని చూపించింది. కొన్ని వారాలుగా బందీలను ఇక్కడే ఉంచినట్లు ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది. గాజాలో ఇప్పటి వరకు 101 మంది బందీలుగా ఉన్నారని, వారిని తీసుకువచ్చే ప్రయత్నాల్లో చేయగలిగినదంతా చేస్తున్నామని ఇజ్రాయిల్ మిలిటరీ ప్రతినిధి డేనియల్ హగారి అన్నారు.

అక్టోబర్ 07 నాడు హమాస్ జరిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు మరణించారు. 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై హమాస్ లక్ష్యంగా దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 40 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.