NTV Telugu Site icon

Israel: “గాజా సిటీని వెంటనే ఖాళీ చేయాలి”.. భారీ దాడికి సిద్ధమైన ఇజ్రాయిల్..

Israel Hamas War

Israel Hamas War

Israel: ఇజ్రాయిల్-హమాస్ పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా హమాస్ మిలిటెంట్ సంస్థను పూర్తిగా నేలకూల్చే వరకు ఇజ్రాయిల్ విశ్రమించేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ యుద్ధం ద్వారా లక్షల సంఖ్యలో ప్రజలు ప్రభావితమయ్యారు. 30 వేలకు పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. అక్టోబర్ 7 నాటి దాడిలో 1200 మందిని హతమార్చిన హమాస్ మిలిటెంట్లు, 251మందిని బందీలుగా గాజలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి బందీలను రక్షించేందుకు ఇజ్రాయిల్ మిలిటరీ ఆపరేషన్స్ చేస్తూనే ఉంది.

Read Also: Mukunda Jewellers: మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌.. ‘ముకుంద జ్యువెల్లర్స్’ రేపే ప్రారంభం

తాజాగా గాజా స్ట్రిప్‌లో ప్రధాన నగరమైన గాజా సిటీ నుంచి ప్రజలు వెళ్లిపోవాలని ఇజ్రాయిల్ సైన్యం బుధవారం వేల కరపత్రాలను సిటీపై విసిరేసింది. గాజాలో ఉన్న ప్రతీ ఒక్కరు నగరం నుంచి దక్షిణాన ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, హమాస్ లక్ష్యాలను సైన్యం టార్గెట్ చేయడంతో ఈ ప్రాంతం ప్రమాదకరమైన పోరాట ప్రాంతంగా మిగిలిపోతుందని కరపత్రాల్లో హెచ్చరించింది. జూన్ 27న ఇజ్రాయిల్ ప్రజలను తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది, ఆ తర్వాతి రోజుల్లో మరో రెండుసార్లు నగరాన్ని విడిచిపెట్టాలని ఆదేశించింది. గాజా నగరం నుంచి దీర్ అల్-బలాహ్ మరియు అల్-జావియాలోని శిబిరాలకు రెండు సురక్షిత మార్గాల ద్వారా తనిఖీలు లేకుండా ప్రజలు చేరుకోవచ్చని తెలిపింది.

ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా యుద్ధం తీవ్ర మారణహోమాన్ని మిగులుస్తోంది. ఇప్పటికే గాజా నగరం దాదాపుగా నాశనమైంది. అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత 251 మంది బందీలుగా హమాస్ పట్టుకుంది. వీరిలో ఇప్పటికీ 116 మంది గాజాలో ఉన్నారు. ఇందులో 42 మంది చనిపోయినట్లు మిలిటరీ తెలిపింది. ఇజ్రాయిల్ దాడిలో గాజాలో కనీసం 38,243 మంది మరణించారు.