Israel Hezbollah: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయిల్ మెరుపు దాడులు చేసింది. సిరియా-లెబనాన్ సరిహద్దు సమీపంలోని జాంటా ప్రాంతంలో హిజ్బుల్లాకు ఆయుధాలు సరఫరా అవుతున్నాయనే అనుమానంతో రాత్రివేళ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడులు చేసింది. ఈ ఆయుధాలు హిజ్బుల్లాకు చేరితే వాటి సైనిక కార్యకలాపాల సామర్థ్యం పెరుగుతుందని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇజ్రాయిల్ పౌరులు, సైన్యంపై దాడులు చేసేందుకు హిజ్బుల్లాకు వీలు కల్పించే ఆయుధాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
హిజ్బుల్లాకు ఆయుధాలు, సైనిక సామాగ్రిని తరలించేందుకు సిరియా మార్గాలను ఉపయోగిస్తున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం ఆరోపించింది. ఈ నేపథ్యంలో సిరియా-లెబనాన్ సరిహద్దు జాంటా ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో హిజ్బుల్లా సైనిక సామర్థ్యాలను తగ్గించడమే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ భావిస్తోంది.
ఇజ్రాయిల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న వేళ ఈ దాడులు జరిగాయి. అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో 120 స్థానాలున్న పార్లమెంట్లో బెంజమిన్ నెతన్యామూ కూటమికి మెజారిటీ రాలేదు. మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో నెతన్యాహూ కూటమి ఆగిపోయింది. దీంతో ప్రతిపక్ష గాడి ఐసెన్కోట్కు అరబ్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తున్నాయి. దీంతో ఐసెన్ కోట్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి.

