Israel: లెబనాన్‌పై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. శుక్రవారం భారీగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ రాకెట్ యూనిట్ డిప్యూటీ హెడ్ మరణించినట్లు తెలిపింది. దక్షిణ లెబనాన్ లోని బజురియేలో జరిగిన స్ట్రైక్స్‌లో అలీ అబ్దెల్ హసన్ నైమ్ మరణించాడని వెల్లడించింది. ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా దాడులకు ఇతను ప్లాన్ చేసినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటించింది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభం తర్వాత హమాస్‌కి మద్దతుగా లెబనాన్ నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంపై తరుచుగా దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రాకెట్లను ఉపయోగించి ఇజ్రాయిల్ భూభాగంపై దాడులు నిర్వహిస్తున్నారు.
Read Also: New Rules : ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త రూల్స్..
ఇదిలా ఉంటే శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర సిరియాలోని అలెప్పో నగరంపై ఇజ్రాయిల్ భీకరదాడులు చేసింది. ఈ దాడుల్లో 38 మంది మరణించారు. ఇందులో ఐదుగురు లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా సభ్యులు ఉన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ టెర్రరిస్టులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 1200 మందిని హతమార్చడంతో పాటు మరో 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అయితే, అప్పటినుంచి ఇజ్రాయిల్ ఆర్మీ గాజాపై తీవ్రంగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 30 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్‌పైకి ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా దాడులు చేయిస్తుందని ఇజ్రాయిల్ ప్రధాన ఆరోపణ. హమాస్, హిజ్బుల్లాకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సహకరిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ తన సరిహద్దుల్లో ఉన్న లెబనాన్, సిరియా ప్రాంతాలపై తరుచుగా దాడులకు పాల్పడుతోంది.
