NTV Telugu Site icon

Israel: ఇజ్రాయిల్ దాడిలో హమాస్ డిప్యూటీ చీఫ్‌ హతం.. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధమని వార్నింగ్..

Hamas

Hamas

Israel: హమాస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయిల్ కదులుతోంది. తాజాగా హమాస్ డిప్యూటీ చీఫ్ సలేహ్ అల్-అరౌరీని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చంపేసింది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఉన్న అల్-అరౌరీపై దాడి చేసి హతమార్చింది. మంగళవారం జరిగిన ఈ ఘటన మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు ఈ దాడిని లెబనాన్ ప్రధాని ఖండించారు. మరోవైపు ఇతని మరణానికి హమాస్‌తో పాటు హిజ్బుల్లా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించాయి.

ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ ఆర్మీ చీఫ్ ప్రతినిధి డేనియల్ హగారి ఈ దాడిపై నేరుగా వ్యాఖ్యానించలేదు. అయితే, ఇజ్రాయిల్ సైన్యం ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉందని అన్నారు. తొలిసారిగా ఇజ్రాయిల్ గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో దాడుల తర్వాత లెబనాన్ రాజధాని బీరూట్‌పై దాడి చేసింది. ఈ దాడి ఆ ప్రాంతంలో సంక్షోభాన్ని మరింత పెంచడమే కాకుండా, యుద్ధం విస్తరించేందుకు అవకాశం ఉందని పాశ్చాత్య దేశాలు భయపడుతున్నాయి.

Read Also: Wrestlers Protest: వందలాది రెజ్లర్ల నిరసన.. ఈసారి మాత్రం బజరంగ్, సాక్షి మాలిక్, వినేష్‌లకు వ్యతిరేకంగా..

ఇదిలా ఉంటే అరూరి మరణం తమ ఓటమికి దారి తీయదని హమాస్ పేర్కొంది. దీనికి తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని ఇజ్రాయిల్‌కి హెచ్చరికలు జారీ చేసింది. లెబనీస్ ప్రధాన మంత్రి నజీబ్ మికాటి ఈ హత్యను ఖండించారు. లెబనాన్‌ని యుద్ధంలోకి లాగడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఇజ్రాయిల్‌పై ఆరోపణలు గుప్పించారు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ మాట్లాడుతూ.. మన ప్రజల, దేశం కోసం నాయకులు అమరులైనప్పటికీ ఉద్యమం ఎప్పటికీ ఆగిపోదని అన్నారు.

అక్టోబర్ 7 నాడు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1200 మందిని హతమార్చారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌లోని హమాస్ నేతల్ని, వారి స్థావరాలను నేటమట్టం చేస్తుంది. హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు యుద్ధం ఆపబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయిల్ దాడిలో ఇప్పటి వరకు 22,185 మంది పాలస్తీనియన్లు మరణించారు.

Show comments