మధ్యప్రాచ్యంలో మరో ఉద్రిక్తత తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నామొన్నటి దాకా ఇరాన్-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ మెత్తబడిందో లేదో ఇప్పుడు ఇజ్రాయెల్ మరో దూకుడుకి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. వివాదాస్పద భూమి వెస్ట్ బ్యాంక్‌ను విలీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునేందుకు నెతన్యాహు కేబినెట్ సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. వెస్ట్ బ్యాంక్‌ను విలీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెస్ట్ బ్యాంక్‌లో అధికారిక భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఈ చర్యలను పాలస్తీనా, సెటిల్మెంట్ వాచ్‌డాగ్ గ్రూప్‌ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ ఏడాది ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎన్నికలు ఎదుర్కోనున్నారు. ఇప్పటికే పాలస్తీనా రాజ్య ఏర్పాటును నెతన్యాహు వ్యతిరేకిస్తున్నారు. పాలస్తీనా ఏర్పడితే ఇజ్రాయెల్‌కు ముప్పు వాటిల్లుతుందని చెబుతున్నారు. ఇక సంకీర్ణ ప్రభుత్వంలో కూడా చాలా మంది వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవడానికే అనుకూల వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ప్రాంతాలన్నీ ఇజ్రాయెల్ సైనిక నియంత్రణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవాలని నెతన్యాహు కేబినెట్ యోచిస్తున్నట్లు సమాచారం.
గత వారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను నెతన్యాహు కలిశారు. 3 గంటలు రహస్యంగా సమావేశం అయ్యారు. అయితే వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని మొదటి నుంచి ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అయితే అక్కడ ఇజ్రాయెల్ స్థిరనివాస నిర్మాణం విస్తరించకుండా మాత్రం అడ్డుకోలేకపోయారు. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునేందుకు అడుగులు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.
