NTV Telugu Site icon

Israel-Hamas War: సంధి ముగిసింది, యుద్ధం మొదలైంది.. ఇజ్రాయిల్ దాడి, 240 మంది మృతి

Israel Hamas War

Israel Hamas War

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ సంధి ముగియడంతో మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో వారం రోజుల పాటు కొనసాగిన కాల్పుల విరమణ, బందీలు-ఖైదీల మార్పిడి నిలిచిపోయింది. సంధిని పొడగించాలని ప్రపంచదేశాలు పిలుపునిచ్చినప్పటికీ.. ఇజ్రాయిల్ పునరుద్ధరించడానికి సిద్ధంగా లేదు. దీంతో గాజాపై ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. గాజా స్ట్రిప్‌పై శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 240 మంది మరణించినట్లు హమాస్ తెలిపింది.

ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి గడువు శుక్రవారంతో ముగిసింది. సాయం చేయడానికి ఈజిప్టు నుంచి రఫా బార్డర్ వద్దకు రావద్దని ఇజ్రాయిల్ ఎన్జీవోలకు చెప్పింది. ఇప్పటి వరకు సంధిలో భాగంగా హమాస్ తమ చెరలో ఉన్న 80 మంది ఇజ్రాయిల్ బందీలను వదిలిపెట్టింది. ఇజ్రాయిల్ తన జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై చేసిన దాడిలో 1200 మందిని చంపింది, 240 మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లింది.

Read Also: Earthquak: ఫిలిఫ్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

సంధి ముగిసిన తర్వాత 400 కంటే ఎక్కువ టార్గెట్లపై ఇజ్రాయిల్ దాడులు చేసినట్లు సైన్యం శనివారం వెల్లడించింది. ఇన్నాళ్లు రక్షణగా ఉన్న దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయిల్ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. ఖాన్ యూనిస్ ప్రాంతంలో 50 కంటే ఎక్కువ లక్ష్యాలపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 15 వేల కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 40 శాతం పిల్లలు ఉన్నారు.

అంతకుముందు సంధి ముగియడానికి మరింత సమయం ఉన్నప్పటికీ.. హమాస్ గాజా నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్లను ప్రయోగించింది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ చర్యల వల్లే సంధి విఫలమైందని అమెరికా ఆరోపించింది. మరోవైపు గాజాపై మరోసారి దాడులు మొదలైనందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మరోవైపు సంధి ముగియడంతో ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంలో లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా దాడుల్ని మళ్లీ ప్రారంభించింది. శనివారం సిరియా రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసిందని సిరియా తెలిపింది. ఇదిలా ఉంటే మరో సంధి ఒప్పందాన్ని తీసుకురావడానికి పలు దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

Show comments