Israel-Gaza Conflict: ఇజ్రాయిల్ దాడులతో విరుకుకుపడుతోంది. గాజా స్ట్రిప్ లోని పలు లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తోంది. రెండో రోజు కూడా ఇజ్రాయిల్ తన దాడులను పెంచింది. గాజాను నియంత్రిస్తున్న ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాదులపై ఇజ్రాయిల్ వరసగా దాడులు చేస్తోంది. శుక్రవారం జరిగిన దాడుల్లో ఒక చిన్నారితో పాటు తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో నలుగురు ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదులను ఇజ్రాయిల్ హతమార్చింది. సుమారుగా 79 మంది గాయపడ్డారు. గత ఏడాది కాలంగా ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఉన్న శాంతి వాతావరణం మరోసారి దెబ్బతింది.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా పాలస్తీనా నుంచి ఉగ్రవాదులు ఇజ్రాయిల్ నగరాలపై రాకెట్లతో దాడి చేసింది. దీంతో రెండో రోజు కూడా ఇజ్రాయిల్ తమ దాడులను పెంచింది. ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్లలో కొన్ని రాజధాని టెల్ అవీవ్ వైపు దూసుకువచ్చాయి. అయితే ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ పాలస్తీనా రాకెట్ దాడులను తిప్పికొట్టింది. మరోవైపు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 19 మంది ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదులను పట్టుకున్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. శుక్రవారం ఇజ్రాయిల్ పైకి పాలస్తీనా దాదాపుగా 160 రాకెట్ల ను ప్రయోగించినట్లు ఇజ్రాయిలీ ఢిపెన్స్ ఫోర్సెస్ తెలిపాయి. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ దాడులపై జోక్యం చేసుకోవాలని.. తమ ప్రజలకు రక్షణ కల్పించాలని పాలస్తీనా పౌర వ్యవహారాల మంత్రి హుస్సెన్ అల్ షేక్ ట్విట్టర్ లో కోరారు.
Read Also: Rakesh Tikait: అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన
ఇజ్రాయిల్ ఆర్మీ వెస్ట్ బ్యాంకులో ఇస్లామిక్ జిహాద్ కమాండర్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఉద్రిక్తత పెరిగింది. దీంతో సదరు ఉగ్రవాద సంస్థ ఈ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ కు వార్నింగ్ ఇచ్చింది. ఆ తరువాత నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సంక్షోభానికి ముగింపు పలికేలా.. ఈజిప్టు, ఐరాస, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయని.. అయితే ఆ చర్చల్లో ఇంకా పురోగతి లేదని పాలస్తీనా అధికారులు తెలిపారు. 2021మేలో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి సంక్షోభం ఏర్పడింది. ఆ సయమంలో ఇరుదేశాలు భీకరపోరు సాగించాయి. ఈ సమయంలో గాజాలో 250 మంది మరణించగా.. ఇజ్రాయిల్ లో 13 మంది మరణించారు. ఆ తరువాత నుంచి సరిహద్దు వెంబడి శాంతి నెలకొన్నా.. ప్రస్తుతం మళ్లీ ఇరు దేశాల మధ్య దాడులు ప్రారంభం అయ్యాయి.